వైస్రాయ్ వీడియో లీక్ : వర్మ ప్లానా?

Fri Mar 15 2019 10:25:10 GMT+0530 (IST)

ఈ ఏడాదిలో అత్యంత వివాదాస్పద చిత్రంగా జనం నోళ్ళలో నానుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఇంకొక్క వారం రోజులు టైం మాత్రమే ఉంది. టిడిపి నాయకులు కొందరు దీన్ని ఎలాగైనా ఆపాలని పార్టీ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఎన్నికల కమీషన్ కు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంగా తామేమి చేయలేని కమీషనర్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా సెన్సార్ కు సంబంధించిన అప్ డేట్ వర్మ బయట పెట్టడం లేదు.ఒకవేళ అడ్డుకునే దాకా పరిస్థితి వస్తే కోర్టు మెట్ల ముందు వీరంగం ఆడతానన్న వర్మ మాటలు ఇప్పటికే రచ్చ చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అత్యంత కీలకంగా చెప్పుకునే వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ తాలుకు 6 నిమిషాల లీక్ అయిన సన్నివేశం చక్కర్లు కొడుతోంది.  అందులో ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి సమేతంగా వైస్రాయ్ హోటల్ వద్దకు చైతన్య రధంతో పాటు అనుచరులను వెంటేసుకుని రావడం ముఖ్యమంత్రి అయినా ప్రైవేటు వ్యక్తులకు ఇందులో అనుమతి లేదని సెక్యూరిటీ చెప్పడంతో మొదలవుతుంది.

బయట నుంచి మైకులో ఎన్టీఆర్ బిగ్గరగా తన వాళ్ళను అభ్యర్థించడం చంద్రబాబుని పోలిన పాత్ర లోపల ఎవరితో చెవిలో ఏదో చెప్పడం అటుపై ఎన్టీఆర్ మీద చెప్పుల వర్షం కురవడం ఇదంతా క్లియర్ కట్ గా చూపించారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా లోపల ఉన్నట్టు అన్ని కవర్ చేశారు. భిన్నుడైన ఎన్టీఆర్ అక్కడే కుప్పకూలుతూ బాధ పడుతుండగా వెనుక నుంచి బ్యాక్ గ్రౌండ్ లో దగా దగా పాట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా రౌండ్లు కొట్టేస్తోంది

ఇది కావాలని పబ్లిసిటీ కోసం లీక్ చేసి వైరల్ చేస్తున్నారా లేక ఇంకేమైనా ప్రయోజనాలు ఆశిస్తున్నారా అనే విషయం కొంత లోతుగా ఆలోచించాలి. 22న విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కమ్ముకుని ఉన్న సమయంలోనే క్లైమాక్స్ కు ముందు వచ్చే చాలా కీలకమైన సీన్స్ ని ఇలా బయటికి వదలడంలో స్ట్రాటజీ వర్మకే తెలియలి. వరస చూస్తుంటే ఒకవేళ నిజంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ నిజంగానే ఆగిపోతే వర్మ యుట్యూబ్ లో పెట్టేసి అన్నంత పని చేసేలా ఉన్నాడు