వెంకీ ది సిన్సియర్

Sun Jun 24 2018 18:56:01 GMT+0530 (IST)

మనకున్న టాప్ మోస్ట్  సీనియర్ హీరోలు నలుగురు ఇంకా ఫామ్ లో కొనసాగుతూ ఫాలోయింగ్ ని కాపాడుకుంటూ వస్తున్నారంటే దానికి కారణం వృత్తి పట్ల వారికున్న సిన్సియారిటీ. ఒకేసారి కాదు కానీ వాళ్ళ సినిమా వచ్చినప్పుడు మాత్రం అది బయట పడుతూనే ఉంది. ఇందులో వెంకటేష్ స్టైల్ మరీ ప్రత్యేకం. సబ్జెక్టు నచ్చితే ఎటువంటి మొహమాటం లేకుండా పాత్ర డిమాండ్ మేరకు తనను తాను మార్చుకునే వెంకీ గురు తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య దర్శకుడు తేజతో మొదలుపెట్టి ఆగిపోయిన ఆటా నాదే వేటా నాదే కోసం చాలా టైం వృధా అయ్యింది.నిన్న మొదలు పెట్టిన ఎఫ్2తో మళ్ళి ఫామ్ లోకి వస్తున్నాడు విక్టరీ హీరో. ఏదో పాత్ర చేస్తున్నాం కదా అని ఆషామాషిగా తీసుకోకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తో రెగ్యులర్ టచ్ లో ఉంటూ తన గెటప్ కు సంబంధించిన ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ వీడియోల రూపం లో శాంపిల్స్ కూడా పంపుతున్నాడట. నిజంగా వెంకీ ఓపికను మెచ్చుకోవచ్చు. తాము చేసేదే చెల్లాలి అన్న ధోరణిలో కాకుండా మూడు సినిమాల వయసున్న దర్శకుడికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషమే.

హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఎఫ్2 వెంకటేష్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. రివీల్ చేస్తే బాగుండదని ప్రారంభోత్సవం నాడు వెంకటేష్ మామూలుగా వచ్చాడు కానీ సినిమాలో మాత్రం డిఫరెంట్ గా ఉంటుందని టాక్. ఇమేజ్ పీక్స్ లో ఉన్నప్పుడే తల మీద ఎకరం పోయింది అని తన మీద తానే జోకులు వేసుకున్న వెంకీ గురులో ఏకంగా హీరోయిన్ లేకుండా మెప్పించాడు. డ్యూయెట్ లేకుండా వెంకటేష్ సినిమా చేయటం గోపాల గోపాల తర్వాత గురునే.

అందుకే ఎఫ్2 లో వెంకీ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందట. వెంకీ మేనకోడలినే వరుణ్ తేజ్ ప్రేమించడం ఆ తర్వాత అదే పెళ్లిలో  తమన్నాతో తన లవ్ స్టోరీ నడిపించడం లాంటి సరదాలతో సినిమా మొత్తం కామెడీ పీక్స్ లో ఉంటుందని టాక్. దీని తర్వాత నాగ చైతన్యతో బాబీ దర్శకత్వంలో ఓ కాంబో మూవీ చేయబోతున్న  వెంకటేష్ ఇకపై స్పీడ్ పెంచుతానంటున్నాడు. ఫాన్స్ కోరుకుంటోంది కూడా అదే కదా.