Begin typing your search above and press return to search.

విక్టరీ హీరో.. ఏమైపోయాడో అసలు?

By:  Tupaki Desk   |   28 July 2017 6:54 AM GMT
విక్టరీ హీరో.. ఏమైపోయాడో అసలు?
X
విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ విడుదలై నాలుగు నెలలైపోయింది. ఇప్పటిదాకా ఆయన కొత్త సినిమా ఊసే లేదు. ఆయన తీరు చూస్తుంటే ఇప్పుడిప్పుడే కొత్త సినిమా ఏదీ సెట్టయ్యేలాగా కనిపించడం లేదు. ‘గురు’ విడుదలకు ముందు ప్రమోషన్లలో పాల్గొన్న వెంకీ.. ఆ తర్వాత అడ్రస్ లేడు. ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ విడుదల తర్వాత వెంకీ కనిపించలేదు. ఈ చిత్రానికి సక్సెస్ మీట్ లాంటిదేమీ కూడా చేయలేదు. రిలీజ్ తర్వాత సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తే దాని రేంజ్ ఇంక పెరిగేదేమో కానీ.. వెంకీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా సైలెంటుగా ఉండిపోయాడు.

‘గురు’ను పట్టించుకోలేదంటే.. తన తర్వాతి సినిమా పనుల్లో వెంకీ బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. వెంకీ ఇప్పుడిప్పుడే ఇంకో సినిమా ఏదీ చేసే మూడ్లో లేనట్లు చెబుతున్నారు. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకీ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా షూటింగ్ ఆరంభానికి ముందే ఆగిపోయింది. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అన్నారు. కానీ అది కూడా ముందుకు కదల్లేదు. పూరి.. బాలయ్యతో సినిమా మీదికి వెళ్లిపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఐతే ‘పైసా వసూల్’ మంచి ఫలితాన్నిస్తే.. ఆ తర్వాత పూరి డైరెక్షన్లోనే సినిమా చేద్దామని వెంకీ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ‘పైసా వసూల్’ ఎలాంటి ఫలితాన్నిస్తుందేమో చూడాలి.