దిల్ రాజు ఫించ్ హిట్టింగ్ కు రెడీ

Thu Dec 06 2018 20:00:02 GMT+0530 (IST)

సంక్రాంతికి ‘యన్.టి.ఆర్’.. ‘వినయ విధేయ రామ’లతో పాటు ‘ఎఫ్-2’ కూడా షెడ్యూల్ అయి ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ప్రచారం విషయంలో ‘యన్.టి.ఆర్’ ముందు నుంచి ఊపులో ఉంది. సినిమా మొదలైన నాటి నుంచి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాంతో పోలిస్తే కొంచెం లేటైనప్పటికీ ‘వినయ విధేయ రామ’ కూడా ఊపందుకుంది. మంచి బజ్ తెచ్చుకుంది. ఇవి రెండూ భారీ చిత్రాలే.వీటి పై ఉన్న అంచనాలు వేరు. కానీ ‘ఎఫ్-2’ అలా కాదు. మిగతా రెండు సినిమాలతో పోలిస్తే దీనికి ముందు నుంచి హైప్ తక్కువే. దీనికి తోడు ఈ చిత్రానికి ప్రమోషనే లేకపోయింది. విడుదలకు నెల రోజుల ముందు కూడా ప్రచారం మొదలు కాలేదు. మీడియాలో కూడా దీని గురించి వార్తలే లేదు. తన సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే దిల్ రాజు ఇలా చేస్తున్నాడేంటి అన్న సందేహాలు అందరిలోనూ కలిగాయి.

ఐతే ముందు నుంచి హడావుడి ఎందుకని దిల్ రాజు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు సమాచారం. ఆయన రిలీజ్ ముంగిట సరిగ్గా నెల రోజుల పాటు సినిమాను ఉద్ధృతంగా ప్రమోట్ చేయాలని డిసైడయ్యాడట. చివరి ఓవర్ల లో వచ్చి ఫించ్ హిట్టింగ్ చేసి హైలైట్ అయినట్లుగా తన సినిమాకు లేటుగా ప్రమోషన్లు మొదలు పెట్టినా కొంచెం గట్టి గా చేసి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలని రాజు భావిస్తున్నాడు. ఇందులో భాగంగా డిసెంబరు 12న ‘ఎఫ్-2’ టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత పాటలు ఒక్కొక్కటే రిలీజ్ చేస్తారు.

ఆ పై ఆడియో వేడుక.. ప్రి రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ లాంచ్ జరుగుతాయి. చిత్ర బృందం ఇన్ని రోజులు పూర్తిగా చిత్రీకరణ మీదే దృష్టిపెట్టింది. ఇక అందరూ కలిసి గట్టిగా సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. హీరోలు వెంకటేష్ వరుణ్ తేజ్‌లతో పాటు హీరోయిన్లు తమన్నా మెహ్రీన్ రంగంలోకి దిగబోతున్నారు. సంక్రాంతికి రాబోయే మిగతా రెండూ భారీ సినిమాలే అయినప్పటికీ.. ఆ సీజన్ కు తగ్గ ఫ్యామిలీ సినిమా తమదే కాబట్టి ‘ఎఫ్-2’కు మంచి ఫలితం వస్తుందని చిత్ర బృందం ధీమాతో ఉంది.