Begin typing your search above and press return to search.

వరుణ్ లవ్ స్టోరీ.. పని మొదలైంది

By:  Tupaki Desk   |   27 April 2017 9:06 AM GMT
వరుణ్ లవ్ స్టోరీ.. పని మొదలైంది
X
‘ముకుంద’ సినిమాతో అరంగేట్రం ఆశించిన స్థాయిలో జరక్కపోయినా ‘కంచె’తో మంచి పేరు సంపాదించాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. ఐతే ఆ సినిమా తెచ్చిన పేరును.. సక్సెస్ ను తర్వాతి సినిమాలు నిలబెట్టలేకపోయాయి. లోఫర్.. మిస్టర్.. ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఎటు పోవాలో తెలియక క్రాస్ రోడ్స్ లో నిలుచుని ఉన్నాడు వరుణ్. లోఫర్.. మిస్టర్ సినిమాలతో ఒకటి మాత్రం రూఢి అయింది. కుర్రాడికి మాస్ వేషాలు అంతగా అచ్చి రావని. అందుకే తన స్టయిల్లో చేస్తున్న ‘ఫిదా’ తనకు మళ్లీ విజయాన్నందిస్తుందని ఆశిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యే దశలో ఉండగా.. మరోవైపు వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడితో వరుణ్ ఓ లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. చడీచప్పుడు లేకుండా ఈ సినిమా పని మొదలుపెట్టేశాడు ఈ యువ దర్శకుడు.

సంగీత దర్శకుడు తమన్‌ తో మ్యూజికల్ సిట్టింగ్స్ చేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు వెంకీ. ఇప్పటిదాకా వరుణ్ తో మీడియం రేంజి మ్యూజిక్ డైరెక్టర్లే పని చేశారు. తొలిసారి తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అతడి సినిమాకు సంగీతాన్నందించబోతున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కూడా మంచి రేంజి ఉన్నవాడే. తమిళంలో కత్తి.. రాజా రాణి.. తెరి లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన జార్జ్ విలియమ్స్ వరుణ్ సినిమాకు ఛాయాగ్రహణం అందించబోతున్నాడు. అతను కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.