ముచ్చటగా మూడోసారి కుదిరిందన్న మెగా హీరో

Fri Jan 11 2019 11:10:37 GMT+0530 (IST)

సీనియర్ హీరో వెంకటేష్ - మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టిస్టారర్ సినిమా 'ఎఫ్2' రేపు అంటే శనివారం విడుదలకు సిద్ధం అవుతోంది.  ఈ కాంబినేషన్ అందరిలో ఆసక్తి రేకెత్తించేదే.  కామెడీలో స్పెషలిస్టు అయిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా మరో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.  ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వరుణ్.. సీనియర్ స్టార్ వెంకటేష్ తో కలిసి నటించడం గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకున్నాడు.'ఎఫ్ 2' కు ముందే వరుణ్ రెండు సార్లు వెంకటేష్ తో కలిసి నటించాల్సి ఉందట.  వరుణ్ చిన్నతనంలో వెంకటేష్ హీరోగా నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలో ఒక పాత్రను ఆఫర్ చేశారట. కానీ ఆ సమయంలో స్కూల్ కు శెలవులు లేకపోవడంతో ఆ అవకాశం మిస్ చేసుకున్నాడట.  మరోసారి 'వాసు' సినిమాలో వెంకటేష్ కు తమ్ముడిగా నటించే అవకాశం వచ్చిందట.  కానీ ఆ సమయంలో బాగా బొద్దుగా ఉండడంతో ఆ అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడట.  ముచ్చటగా మూడోసారి 'ఎఫ్ 2' లో వెంకటేష్ గారితో కలిసి నటించే అవకాశం దొరికిందని చెప్పుకొచ్చాడు వరుణ్.

సీనియర్ అయినప్పటికీ వెంకీ ఎంతో జోవియల్ గా ఉంటారని.. జూనియర్లకు తన విలువైన సూచనలు సలహాలు అందిస్తుంటారని గొప్పగా చెప్పాడు వరుణ్. పెదనాన్న చిరంజీవికి సమకాలికుడైనా ఆ స్టార్డం ఏ రోజు కూడా చూపించలేదని అన్నాడు.  మరో సారి ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని అన్నాడు.