Begin typing your search above and press return to search.

తొలి ప్రేమ.. సాధించేసింది

By:  Tupaki Desk   |   22 Feb 2018 8:37 AM GMT
తొలి ప్రేమ.. సాధించేసింది
X
ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అన్ని రకాలుగా ఆమోదం పొంది.. మంచి వసూళ్లు సాధించింది ‘తొలి ప్రేమ’నే. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వసూళ్లు కూడా ఆరంభం నుంచే చాలా బాగా వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా సత్తా చాటుకుంది. రెండు వారాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటేసి లాభాల బాటలో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర వసూళ్లు రూ.23 కోట్ల దాకా ఉన్నాయి. ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన అందరూ లాభాల్లోకి వచ్చేశారు. అమెరికాలో ఈ చిత్రం మిలియన్ మార్కును కూడా టచ్ చేసేయడం విశేషం.

తొలి వారాంతంలోనే హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న ‘తొలి ప్రేమ’ ఆ తర్వాత నెమ్మదించింది. ఒక దశలో పరిస్థితి చూస్తే 9 లక్షల డాలర్ల మార్కు దగ్గర వసూళ్లు ఆగిపోతాయని అనుకున్నారు. కానీ తర్వాతి వారం వచ్చిన సినిమాల్లో ‘అ’ మాత్రమే ఆడింది. ‘మనసుకు నచ్చింది’ తుస్సుమనిపించింది. ఈ వారం అసలు చెప్పుకోదగ్గ సినిమాలే లేవు. ఇది ‘తొలి ప్రేమ’కు బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం మిలియన్ మార్కు వైపు అడుగులేసింది. సెకండ్ వీకెండ్ తర్వాత సోమవారం కూడా ఈ సినిమా 27 వేల డాలర్ల దాకా వసూలు చేయడం విశేషమే. బుధవారం ఈ చిత్ర మిలియన్ మార్కును దాటినట్లు సమాచారం. వరుణ్ తేజ్‌ కు ఇది వరుసగా రెండో మిలియన్ డాలర్ మూవీ. అతడి గత సినిమా ‘ఫిదా’ ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది.