Begin typing your search above and press return to search.

సంచలనం: హీరో కుమార్తెకూ చేదు అనుభవం

By:  Tupaki Desk   |   20 Feb 2017 3:55 PM GMT
సంచలనం: హీరో కుమార్తెకూ చేదు అనుభవం
X
చిత్ర పరిశ్రమకు సంబంధించి మరో సంచలనం బయటకు వచ్చింది. తెలుగు.. తమిళ.. మలయాళ నటి భావనకు ఎదురైన దారునాన్ని ఇంకా మర్చిపోక ముందే.. ఊహించని రీతిలో మరో అంశం తెర పైకి వచ్చింది. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన శరత్ కుమార్ కుమార్తె కమ్ హీరోయిన్ అయిన వరలక్ష్మికి లైంగిక వేధింపులు తప్పలేదన్న వార్త ఇప్పుడు పెనుసంచలనంగా మారింది.

తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. తనకు ఎదురైన ఇబ్బందిని భారీ లేఖలో వెల్లడించింది. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా.. అక్కడి ప్రోగ్రాం హెడ్ ఒకరు తనతో అసభ్యంగా వ్యవహరించిన విషయాన్ని వెల్లడించింది. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పైనా వేధింపులు వెలుగు చూడటం దారుణంగా ఉందన్న ఆమె.. మహిళల భద్రత అన్నది జోక్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘సమాజంలో అసలేం జరుగుతోంది? మహిళల భద్రత ఒక జోక్ గా మారింది. ఈ వెధవల్ని ఉరి తీయాలి’’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. నటి భావనకు తాను పూర్తి మద్దతు పలుకుతున్నానని.. వాళ్లకు కఠిన శిక్ష పడి తీరుతుందన్నారు. ఇక.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వెల్లడించారు. తాను ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి టీవీ ఛానల్ కు వెళ్లానని.. అక్కడి ప్రోగ్రామింగ్ హెడ్ తనతో మాట్లాడుతూ.. మనం బయట ఎక్కడైనా కలుద్దామా అని అడిగినట్లుగా వెల్లడించారు.

‘‘కార్యక్రమం మరో అరగంటలో ముగుస్తుందన్న సమయంలో అతను మాట్లాడుతూ.. బయట ఎక్కడైనా కలుద్దామా? అని అడిగాడు. ఏం.. ఏదైనా పని కోసమా అని అడిగా. కాదు.. ఇతర విషయాల కోసమంటూ అసభ్యంగా మాట్లాడాడు. నేను కోపంగా అతడ్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పా. సినిమా పరిశ్రమతో పాటు బయట కూడా ఇలాంటి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. పరిశ్రమకు శరీరాన్ని అమ్ముకోవటానికి రాలేదు. నటన అంటే ఇష్టం.. అందుకే వచ్చా. ఇలాంటి దారుణాల్ని అడ్డుకొని.. వాటిని బయటకు మాట్లాడాలన్నదే ఉద్దేశ్యం’’ అని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

వెండి తెర మీద గ్లామరస్ గా కనిపించినంత మాత్రాన.. తన గురించి ఎలా మాట్లాడితే అలా మాట్లాడితే కుదరన్న ఆమె..తన జీవితం.. తన శరీరం తన ఇష్టమని.. ఏ మగాడూ తనను అగౌరవంగా చూసి సులభంగా వెళ్లిపోతాడని అనుకోకూడదని ఆమె తేల్చిచెప్పారు. తనకు ఎదురైన విషయం గురించి బయటకు చెప్పాలా? వద్దా? అని రెండు రోజుల పాటు మదన పడ్డానని.. చివరకు చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు.

మహిళల భద్రత అన్నది కేవలం కలగా మిగిలిపోయిందని.. మన సమాజం నుంచి రేప్ అనే పదం ఎప్పటికీ తొలిగిపోదా? అని ప్రశ్నించిన ఆమె.. మహిళలంతా గళం విప్పాలని.. మహిళలు ఎవరూ ఒంటరి వారు కారని.. వారిని తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు.. మిగిలిన వర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులుఉంటాయన్నారు. ఒక అగ్ర హీరో కుమార్తె.. కమ్ హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి ఎదురుకావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/