ప్రేమించిన అమ్మాయి కోసం 'మహర్షి' దర్శకుడి పాట్లు

Mon May 27 2019 11:10:28 GMT+0530 (IST)

మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం 'మహర్షి'కి దర్శకత్వం వహించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అయినా కూడా చేసిన సినిమాలు చాలా తక్కువ. చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ సక్సెస్ లను దక్కించుకుంటున్న దర్శకుడు వంశీ. స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్న ఈయన తాజాగా మహేష్ బాబుతో 'మహర్షి' చిత్రాన్ని చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తనకు మహర్షి లాంటి సినిమాను ఇచ్చినందుకు స్వయంగా మహేష్ బాబు.. వంశీకి ముద్దు పెట్టి మరీ కృతజ్ఞతలు చెప్పిన విషయం తెల్సిందే. మహేష్ ను మరీ అంత ఎమోషన్ చేసిన దర్శకుడు వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు.దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన 'భద్ర' చిత్రంకు సహాయ దర్శకుడిగా చేస్తున్న సమయంలో మాలినిని వంశీ చూశాడట. ఆ సమయంలోనే ఆమెపై ఆసక్తి కలిగిందని అదే రోజు ఆమె నెంబర్ సంపాదించి పది నిమిషాలు మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కూడా ఫోన్ లో మాట్లాడుకున్నాం. ఆమెను కలిసేందుకు ఒకసారి బెంగళూరు వరకు వెళ్లాను. ఆమె కూడా తన కోసం వస్తే తమ ప్రేమ నిజమవుతుందని భావించాను. మొదట కలిసేందుకు ఒప్పుకోకున్నా.. ఆ తర్వాత నన్ను కలిసింది. అప్పుడే నేను మాలినిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను.

మాలినికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెల్సిందే. దాంతో నేను వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల నాన్నతో మాట్లాడాను. సినిమా ఇండస్ట్రీ వ్యక్తి.. అదీ ఒక సహాయ దర్శకుడికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్దంగా లేను అంటూ ఆయన నో చెప్పాడు. అప్పటి నుండి మాలిని వద్ద నుండి ఫోన్ కూడా లాగేసుకున్నాడు. ఏదో విధంగా మాట్లాడుకునేవాళ్లం. ఆ సమయంలోనే నాకు 'మున్నా' చిత్రంకు ఛాన్స్ దక్కింది. మాలినిని ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పాను. ఇంట్లో వారు మొదట కాస్త అటు ఇటు అన్నా ఆ తర్వాత ఒప్పుకున్నారు. మున్నా సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది.

మున్నా ఫ్లాప్ అవ్వడంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. డిప్రెషన్ నుండి తేరుకోవడం కోసం మా ఇంట్లో వాళ్లు మాలిని కుటుంబ సభ్యులను ఒప్పించి మా పెళ్లి జరిపారు. ఆ తర్వాత నేను తేరుకున్నాను. ఆ తర్వాత వరుసగా మంచి విజయాలు దక్కాయి. మాలిని ఎంట్రీతోనే నా జీవితంలో సక్సెస్ వచ్చిందని వంశీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి వంశీ పైడిపల్లి తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఓ సినిమా స్టోరీలా సాగిందని చెప్పుకొచ్చాడు.