Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'గద్దలకొండ గణేష్ (వాల్మీకి)'

By:  Tupaki Desk   |   20 Sep 2019 11:11 AM GMT
మూవీ రివ్యూ : గద్దలకొండ గణేష్ (వాల్మీకి)
X
చిత్రం : 'వాల్మీకి/గద్దలకొండ గణేష్'

నటీనటులు: వరుణ్ తేజ్ - అధర్వ మురళి - పూాజా హెగ్డే - మృణాళిని రవి - బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
కథ: కార్తీక్ సుబ్బరాజ్
అడిషనల్ డైలాగ్స్: మిథున్ చైతన్య - మధు శ్రీనివాస్
నిర్మాతలు: రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట
రచన - దర్శకత్వం: హరీష్ శంకర్

‘దువ్వాడ జగన్నాథం’తో ఆశించిన ఫలితాన్నందుకోలేకపోయి దర్శకుడు హరీష్ శంకర్.. ఈసారి తమిళ కల్ట్ మూవీ ‘జిగర్ తండ’ ఆధారంగా ‘వాల్మీకి’ తీశాడు. తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రకు వరుణ్‌ ను ఎంచుకుని.. ఆ పాత్రకు తనదైన టచ్ ఇచ్చి సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి తీసుకొచ్చాడు. విడుదలకు కొన్ని గంటల ముందు ‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకుని.. ఈ రోజే థియేటర్లలోకి దిగిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అభిలాష్ (అధర్వ మురళి) దర్శకుడు కావాలని కలలు కంటున్న కుర్రాడు. అతను రకరకాల కథలతో నిర్మాతల్ని కలుస్తాడు. కానీ ఏదీ వర్కవుట్ కాదు. ఒక గ్యాంగ్ స్టర్ కథ అయితే సినిమా నిర్మించడానికి సిద్ధమని ఓ నిర్మాత చెప్పడంతో.. ఒక నిజ జీవిత గూండా జీవితం ఆధారంగా కథ రాయాలని సంకల్పిస్తాడు బాలమురళి. ఈ క్రమంలో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లోని గద్దలకొండ అనే గ్రామంలో గణేష్ (వరుణ్ తేజ్) అనే గూండా గురించి అతడికి తెలుస్తుంది. ఆ ఊరికి వెళ్లి గణేష్ గురించి ఆరా తీయడం మొదలుపెడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న దశలో బాలమురళి.. అనుకోకుండా గణేష్ వలలో చిక్కుతాడు. అప్పుడు గణేష్.. బాలమురళిని ఏం చేశాడు.. అతడి నుంచి తప్పించుకోవడానికి బాలమురళి ఏం చెప్పాడు.. ఇంతకీ ఈ గణేష్ కథేంటి.. తర్వాత పరిణామాలేంటి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

చాలా కొత్తగా అనిపించే కథ.. అందులో వావ్ అనిపించే ఒక విలన్ పాత్ర.. తమిళంలో క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘జిగర్ తండ’కు ప్రధాన ఆకర్షణలివే. కథను మించి అందులో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర హైలైట్ అయి ఆ సినిమాను నిలబెట్టేసింది. ‘జిగర్ తండ’ను రీమేక్ చేయాలని అనుకున్నపుడు.. విలన్ పాత్ర కోసం బాబీ సింహానే తీసుకోవాలనే ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రకు మరొకరిని, పైగా ఒక హీరోను ఎంచుకోవడం హరీష్ శంకర్ చేసిన సాహసం. అతను అంతటితో ఆగలేదు. తమిళంతో పోలిస్తే తెలుగులో ఆ పాత్ర టోన్ మార్చేశాడు. గెటప్, హావభావాలు, నటన.. అన్నింట్లోనూ మార్పు చూపించాడు.

అసలే హరీష్ ఒక ఫ్లాప్ తీసి వెనుకబడి ఉన్నాడు. పైగా ఇప్పుడు ఒక క్లాసిక్ ను ముట్టుకున్నాడు. ఇలాంటి స్థితిలో మాతృకకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన పాత్రపై ఇలా చేయి చేసుకోవడం మామూలు సాహసం కాదు. ఐతే ఒక కన్విక్షన్ తో అతను చేసిన ఈ మార్పులు వృథా పోలేదు. బాబీ సింహా పాత్రను ఉన్నదున్నట్లుగా తీస్తే - బాబీ సింహానే అందులో నటిస్తే తెలుగు ప్రేక్షకులు ‘వాల్మీకి’ని ఎలా రిసీవ్ చేసుకునేవారో కానీ.. హరీష్ తనదైన టచ్ ఇస్తూ తీర్చిదిద్దిన గద్దలకొండ గణేష్ పాత్ర.. అందులో వరుణ్ తేజ్ నటన పెద్ద ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ప్రేక్షకుల దృష్టి మరల్చనీయకుండా చేసిన ఆ పాత్రే సినిమాను నిలబెట్టేసింది. మాతృక చూసిన వాళ్లు అందులో ఉన్న క్లాస్ - క్లాసిక్ టచ్ తెలుగులో మిస్సయిందని ఫీలైతే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ‘వాల్మీకి’ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు.

కథాకథనాల సంగతెలా ఉన్నా.. ఒక పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం ద్వారా మిగతా లోపాల్ని మరిచిపోయి సినిమాతో ఎంగేజ్ అయిపోవడం అరుదుగా జరుగుతుంటుంది. ఆ మధ్య వచ్చిన ‘జై లవకుశ’ సినిమాలో జై పాత్ర ఈ కోవకే చెందుతుంది. ‘వాల్మీకి’లో గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ అంతకుమించి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. కెరీర్లో చాలా వరకు నెమ్మదైన.. సున్నితమైన పాత్రలే చేసిన వరుణ్ తేజ్.. చాలా లౌడ్ గా అనిపించే ఈ పాత్రలో కనిపించడం.. గెటప్.. మేనరిజమ్స్.. డైలాగ్ డెలివరీ అన్నీ మార్చేయడంతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి కలుుతుంది. ఈ పాత్ర స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల ఆసక్తి నిలిచి ఉండేలా చేయడంలో దర్శకుడు హరీష్ శంకర్ విజయవంతం అయ్యాడు. పరిచయ సన్నివేశంతోనే గణేష్ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. వరుణ్ ఏ తడబాటు లేకుండా తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు.. సందర్భానుసారంగా భలేగా పేలాయి. గణేష్ కనిపించే తొలి సన్నివేశం తర్వాత అతడి క్రూరత్వాన్ని చాటిచెప్పే మరో రెండు సన్నివేశాలు కొంచెం రిపిటీటివ్ లాగా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ఆ పాత్రను మలుపు తిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్.. ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపుతుంది.

ద్వితీయార్ధంలో ‘వాల్మీకి’ కథ ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందని విధంగా సాగుతుంది. మాతృక గురించి తెలియిన వాళ్లు కచ్చితంగా ద్వితీయార్ధంలో కొత్త అనుభూతికి గురవుతారు. సినిమాలో సినిమా చుట్టూ మలుపు సాగే వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వరకు సాధారణంగా అనిపించి.. ఇంకెప్పుడొస్తుంది ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ పాట అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తుంది. ఐతే ఆ పాట.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ముగించిన తీరు ఆకట్టుకుంటాయి. తమిళంతో పోలిస్తే హీరో తల్లి పాత్రకు ఇక్కడ ప్రాధాన్యం పెంచడం.. సెంటిమెంట్ కనెక్షన్ పెట్టడం బాగుంది. సినిమా ముగింపు కోసం ఆమె పాత్రను హరీష్ చక్కగా వాడుకున్నాడు. అలాగే తనికెళ్ల భరణి పాత్ర ద్వారా కూడా హరీష్ చక్కగా ఎమోషన్ పండించాడు. ప్రి క్లైమాక్స్ దగ్గర ‘వాల్మీకి’ కొంచెం దారి తప్పి ఎటు పోతోందో అర్థం కాని గందరగోళం నెలకొంటుంది. వేగం కూడా తగ్గుతుంది. కానీ ముగింపు మాత్రం మెప్పిస్తుంది. అమ్మ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా తమిళ వెర్షన్ ను క్లైమాక్స్ మెరుగ్గా అనిపిస్తుంది. చివర్లో సుకుమార్.. నితిన్ ల క్యామియోలు కొసమెరుపుల్లా ఉపయోగపడ్డాయి. ఆరంభంలో.. మధ్య మధ్యలో ‘వాల్మీకి’ కొంత గాడి తప్పినా.. ప్రేక్షకుడి అంచనాలకు భిన్నంగా సాగే కథ అందరికీ రుచించే అవకాశాలు లేకపోయినా.. వరుణ్ పాత్రతో పాటు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ఆకర్షణలు ‘వాల్మీకి’లో చాలానే ఉన్నాయి. తమిళం నుంచి తీసుకున్న క్లాస్ కథకు హరీష్ ఇచ్చిన మాస్ టచ్ వల్ల మన ప్రేక్షకుల్ని మెప్పించేలాగే తయారైంది ‘వాల్మీకి’. మాతృకతో దీన్ని పోల్చి నిరాశ చెందే వాళ్లు కూాడా ఉండొచ్చు కానీ.. మామూలుగా చూస్తే ‘వాల్మీకి’ మెప్పిస్తాడు.

నటీనటులు:

‘వాల్మీకి’ సినిమాతో వరుణ్ తేజ్ నటుడిగా కొన్ని మెట్లు ఎక్కాడు. అతడి కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ పాత్రకు వరుణ్ ను ఎంచుకున్నందుకు హరీష్ ను.. ఈ పాత్ర ఒప్పుకున్నందుకు వరుణ్ ను అభినందించాల్సిందే. ఈ ఆలోచన దగ్గరే వీళ్లిద్దరూ మార్కులు కొట్టేశారు. వరుణ్ లుక్ - మేనరిజమ్స్ - బాడీ లాంగ్వేజ్ - డైలాగ్ డెలివరీ అన్నీ కూడా భలేగా కుదిరాయి. ఇప్పటిదాకా ఎక్కువగా సటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న వరుణ్.. తొలిసారి చాలా లౌడ్ గా అనిపించే పాత్రలో మెప్పించాడు. సినిమాలో మిగతా పాత్రలన్నింటినీ అతను పక్కకు నెట్టేసి స్క్రీన్ మీద ఆధిపత్యం చలాయించాడు. అధర్వ మురళి ఉన్నంతలో బాగానే చేశాడు కానీ.. పాత్ర పరంగా వరుణ్ ముందు అతను చిన్నబోయాడు. పూజా హెగ్డే కనిపించిన కాసేపు తన అందంతో అలరించింది. ఎల్లువొచ్చి గోదారమ్మ పాటలో పూజా మెరిసిపోయింది. మృణాళిని రవి పర్వాలేదు. బ్రహ్మాజీ రౌడీ బ్యాచ్ కు నటన నేర్పించే పాత్రలో భలేగా నవ్వించాడు. చింతమల్లిగా సత్య కామెడీ కూడా అలరిస్తుంది. శత్రు - జబర్దస్త్ రవి - మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతికవర్గం:

సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తనలోని కొత్త కోణాన్ని ‘వాల్మీకి’లో చూపించాడు. క్లాస్ టచ్ ఉన్న పాటలు - నేపథ్య సంగీతానికే పేరుపడ్డ అతను.. ‘వాల్మీకి’లో పూర్తిగా మాస్ పాటలు - ఆర్ ఆర్ చేశాడు. వాకా వాకా.. జర్రజర్ర లాంటి మాస్ బీట్స్ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంలో చాలానే మార్పు చూపించాడు మిక్కీ. తాను మాస్ సినిమాలకు గూస్ బంప్స్ ఇచ్చే నేపథ్య సంగీతం ఇవ్వగలనని రుజువు చేశాడు. అయానంక బోస్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సినిమాకు రిచ్ లుక్ తీసుకురావడంలో అతడి కెమెరా కీలక పాత్ర పోషించింది. 14 రీల్స్ ప్లస్ బేనర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు హరీష్ శంకర్.. రీమేక్ తీయడంలో మరోసారి తన నేర్పరితనం చూపించాడు. ‘జిగర్ తండ’కు అతను ఇచ్చిన మాస్ టచ్ అందరికీ రుచించకపోవచ్చు కానీ.. చాలా క్లాస్ గా కనిపించే ఆ చిత్రాన్ని తెలుగులో మాస్ కు చేరువ చేయడంలో మాత్రం అతను విజయవంతం అయ్యాడు. డైలాగుల్లో హరీష్ మార్కు కనిపిస్తుంది. ‘‘నమ్మకం ప్రాణం లెక్క. ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాదు’’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. కథనంలో అక్కడక్కడా బిగి సడలినప్పటికీ.. అనేక హంగులు అద్ది సినిమాను అతను జనరంజకంగానే మలిచాడు హరీష్.

చివరగా: వాల్మీకి.. క్లాస్ కథలో మాస్ మెరుపులు

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre