Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ ఛేంజ్‌

By:  Tupaki Desk   |   19 Sep 2019 4:27 PM GMT
బిగ్ బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ ఛేంజ్‌
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ నటించిన `వాల్మీకి` సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే రిలీజ్ ముందు ఈ సినిమా టైటిల్ వివాదాస్ప‌దం అయ్యింది. ఈ టైటిల్ మార్చాల్సిందేనంటూ గ‌త రెండు వారాలుగా వాల్మీకి బోయ‌లు పంతం ప‌ట్టి రాజ‌కీయనాయ‌కుల అండ‌తో కోర్టుల ప‌రిధిలో పోరాడుతున్నారు. దీనిపై తెలంగాణ కోర్టు కౌంట‌ర్ వివ‌ర‌ణ‌ను కోరింది.

రేపు రిలీజ్ ఉండ‌గా ఇప్ప‌టికీ ఈ సినిమా టైటిల్ మార్పు గురించి యుద్ధం జ‌రుగుతూనే ఉంది. సినిమాకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం.. కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్‌ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

ఈ నేప‌థ్యంలో హాఠాత్తుగా `అర్జెంట్ ప్రెస్ మీట్` అంటూ ఇప్ప‌టికిప్పుడు 9.30పీఎం ప్రెస్ మీట్ కి క‌ల‌వాల్సిందిగా తెలుగు మీడియాకి క‌బురందింది. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మాత‌లు స‌హా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మీడియాతో ఇంటరాక్ట్ కానున్నారు. అయితే వాల్మీకి బోయ‌ల డిమాండ్ మేర‌కు చివ‌రి నిమిషంలో మ‌న‌సు మార్చుకుని టైటిల్ మార్చ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి `గ‌డ్డ‌ల‌కొండ గ‌ణేష్` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. టీజ‌ర్ ట్రైల‌ర్ తో ఇప్ప‌టికే ఈ పేరు యూత్ లోకి వెళ్లిపోయింది కాబ‌ట్టి ఈ మార్పుతో వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంద‌ట‌. టైటిల్ `గడ్డ‌లకొండ గణేష్` గా మారుస్తున్న‌ట్టు తెలంగాణ‌ కోర్టుకి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెల్ల‌డించారట‌. వివాదాల‌తో ప్ర‌చారం మొత్తానికి వాల్మీకికి క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.