Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్ లో ఉయ్యాలవాడ వారసులు

By:  Tupaki Desk   |   17 Sep 2019 7:48 AM GMT
పోలీస్ స్టేషన్ లో ఉయ్యాలవాడ వారసులు
X
టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాక్ నడుస్తున్న మూవీ సైరా. సాహో మీద భారీ అంచనాల వేళ.. కలెక్షన్ల పరంగా ఓకే అయినా.. టాక్ పరంగా డివైడ్ కావటం.. రానున్న రోజుల్లో భారీ సినిమాల భవితవ్యాన్ని సైరా ఫలితం తేలుస్తుందన్న వాదన ఉంది. చిరు నటిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం మీద సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తుంటే.. మరోవైపు ఈ చిత్రం రూపొందించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకుల ఆందోళనలు పంటి కింది రాయిలా మారుతున్నాయి.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదో తరం వారసులకు చిరు కుటుంబంలో గతంలో రూ.5 కోట్లు ఇస్తామని చెప్పి.. అగ్రిమెంట్ తో పాటు నోటరీ కూడా చేసి ఇచ్చారని.. ఇప్పటివరకూ న్యాయం చేయలేదంటూ నిరసన చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో రెండు..మూడుసార్లు ఈ వివాదం తెర మీదకు వచ్చింది.

తాజాగా ఉయ్యాలవాడ వంశీకులకు చెందిన కొందరు జూబ్లీహిల్స్ లోని కొణిదల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో..పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఉయ్యాలవాడ వారసుల కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా తమను కలిసిన మీడియా వారితో మాట్లాడిన వారు.. గత మేలో స్వామినాయుడు.. రాంచరణ్ పీఏ అవినాష్ తదితరులు తమను పిలిపించి రూ.5 కోట్లకు అగ్రిమెంట్ చేయించారని.. నోటరి కూడా చేశారని చెప్పారు. ఉయ్యాలవాడ వంశీకులైన 22 మందికి ఈ మొత్తాన్ని ఇస్తామని మాట ఇచ్చారన్నారు. అయితే.. ఇప్పటివరకూ వారు మాట మీద నిలబడలేదని.. న్యాయం చేయలేదని ఆరోపిస్తున్నారు.

గత నెలలో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా న్యాయం చేయకపోవటంతో తాము రాంచరణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. తమకు ఎలాంటి హక్కులు లేవంటూ రాంచరణ్ పీఏ అవినాష్ చెబుతున్నారని.. తమను మోసం చేసినట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసిన నోటరీని ఎలా మర్చిపోతారని వారు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.