Begin typing your search above and press return to search.

పండ‌గే కానీ... ఆ సంద‌డి క‌నిపించ‌డం లేదే!

By:  Tupaki Desk   |   28 July 2015 11:46 AM GMT
పండ‌గే కానీ... ఆ సంద‌డి క‌నిపించ‌డం లేదే!
X
పెద్ద సినిమాల విడుద‌ల అంటే టాలీవుడ్‌ లో నిజంగా పండ‌గ వాతావ‌ర‌ణమే. థియేట‌ర్లు కొత్త శోభ‌ని సంత‌రించుకొంటుంటాయి. అభిమానుల కోలాహ‌లం క‌నిపిస్తుంటుంది. మా సినిమా ఆ రికార్డు ని కొడుతుంది, ఈ రికార్డుని క్రియేట్ చేస్తుంది అంటూ మాట్లాడుకొంటుంటారు. నిజంగానే స్టార్ల సినిమాలు చాలా వ‌ర‌కు ఏదో ర‌కంగా ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసి వెళ్లిపోయేవి. `బాహుబ‌లి`కి ముందు కూడా రికార్డుల గురించి చాలానే మాట్లాడుకొన్నాం. ఆ సినిమా బిజినెస్సే రికార్డు స్థాయిలో జ‌రిగింది. దీంతో బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు ఖాయం అని అప్పుడే తెలిసిపోయింది. భారీస్థాయిలో తెర‌కెక్క‌డంతో పాటు, భారీ క్రేజ్ మ‌ధ్య విడుద‌ల అవుతుండ‌డంతో `బాహుబ‌లి`కి ముందు వేరే సినిమాలు బాక్సాఫీసు బ‌రిలోకి దిగ‌లేక‌పోయాయి. సినిమా విడుద‌ల త‌ర్వాత కూడా అదే ప‌రిస్థితి. నిన్న‌టి `జేమ్స్‌ బాండ్` వ‌ర‌కు బాహుబ‌లికి భ‌య‌ప‌డి తెలుగు బాక్సాఫీసును వేరే కొత్త సినిమాలేవీ ప‌ల‌క‌రించ‌లేక‌పోయాయి.

ఇప్పుడిప్పుడే కొద్దిమంది నిర్మాలు త‌మ సినిమాల్ని విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మ‌హేష్‌ బాబు `శ్రీమంతుడు`, అనుష్క `రుద్ర‌మ‌దేవి`, ర‌వితేజ `కిక్‌2` చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల కాబోతున్నాయి. `బాహుబ‌లి`లాంటి సినిమా వ‌చ్చుండ‌క‌పోతే ఈ మూడు కూడా చాలా పెద్ద సినిమాలే. ఒకొక్క‌టి యాభై కోట్ల పైచిలుకు వ్య‌యంతో తెర‌కెక్కాయి. వీటితో ప‌రిశ్ర‌మ ఊగిపోవాలి. బిజినెస్ లావాదేవీలు హోరెత్తాలి. కానీ ఇదివ‌ర‌క‌టి స్థాయిలో ప్రేక్ష‌కుల్లోనూ, ప‌రిశ్ర‌మ‌లోనూ క్యురియాసిటీ క‌నిపించ‌డం లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే పెద్ద సినిమాలొస్తున్నాయి... పండ‌గ వాతావ‌ర‌ణ‌మే క‌నిపించ‌డం లేదు. అభిమానులు కూడా `బాహుబ‌లి` రికార్డుల్ని ఇప్ప‌ట్లో ఏ సినిమా కొట్ట‌లేదు అని మాట్లాడుకొంటున్నారు. అంటే ఏదో ఒక సినిమా మ‌ళ్లీ సంచ‌ల‌న విజ‌యం సాధించేవ‌ర‌కు ప‌రిశ్ర‌మలో స్త‌బ్ద‌త వీడ‌ద‌న్న‌మాట‌.

సినిమా విశ్లేష‌కులు మాత్రం ``ప్ర‌తీ సినిమా `బాహుబ‌లి` కాలేదు. వ‌చ్చే సినిమాల క‌థ‌లు ప్రామిసింగ్‌ గానే క‌నిపిస్తున్నాయి. వినోదాల‌కి కొద‌వేం ఉండ‌దు`` అని చెబుతున్నారు. మ‌హేష్ `శ్రీమంతుడు` క‌థ ప్రామిసింగ్‌ గా అనిపిస్తోంది. రికార్డుల సంగ‌తిని ప‌క్క‌న‌పెట్టి క‌థ‌నిబ‌ట్టి చూస్తే ప్రేక్ష‌కుల మ‌న‌సును గెలుచుకొనేలాగే ఉంది. `రుద్ర‌మ‌దేవి` కూడా `బాహుబ‌లి`కి ధీటుగానే క‌నిపిస్తోంది. `కిక్‌2`లో ర‌వితేజ అల్ల‌రి పుష్క‌లం. సో... రాబోయే పెద్ద సినిమాల‌తో పండ‌గ చేసుకోవ‌డానికి సిద్ధ‌మైపోవ‌చ్చ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.