అంబానీల పెళ్లిలో పున్నమి నాగు!

Mon Dec 10 2018 12:21:55 GMT+0530 (IST)

నాగస్వరం ముందు నాగుపాములా ఆడింది. కోడె త్రాచులా బుసలు కొట్టింది. నాగిని నాట్యం చిన్నబోయేలా అంబానీల సంగీత్ వేడుకలో బియాన్స్ వేసిన స్టెప్పులు కుర్రాళ్లలో హాట్ టాపిక్. రాజుగారి ఇంట పెళ్లి అంటే రసరమ్య విందుకు - వీనులవిందుకు కొదవేంటి? అన్నట్టే ఉందీ వ్యవహారం.అమెరికన్ పాప్ గాయని బియాన్స్ గురించి ఇప్పుడే పరిచయం అక్కర్లేదు. ఈ భామ రిలయన్స్ అంబానీల ప్రీపెళ్లి వేడుకలో తళుక్కుమనడం యూత్ లో వేడెక్కించింది. అంతేకాదు సంగీత్ కార్యక్రమంలో బియాన్స్ దేవకన్యను - సర్పకన్యను తలపించింది. మత్తెక్కించే నాట్యంతో మైమరిపించింది. వేడుకలో జనాల చూపులన్నీ అటువైపే.

ఏదైనా పబ్లిక్ వేడుకకు లేదా పెళ్లి వేడుకకు ఎవరైనా సెలబ్రిటీ అటెండ్ అయితే తమతో ఫోటోలు - సెల్ఫీలు దిగేందుకు అభిమానులు మీద పడతారు. కానీ ఇక్కడ సన్నివేశమే వేరే. ముంబై ఖాళీ చేసి వచ్చిన టాప్ సెలబ్రిటీలంతా బియాన్స్ తో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారట. ఆ క్రమంలోనే ఈ పాప్ గాయనిని రౌండప్ చేసి కన్ ఫ్యూజ్ చేశారని తెలుస్తోంది. ఎరుపు రంగు మిర్రర్ ఛమ్కీల డ్రెస్ లో  - లెహెంగాలో - రకరకాల డిజైనర్ దుస్తుల్లో ఈ అమ్మడు నాట్య విలాపం కుర్రకారుకు కంటిమీద కునుకు పట్టనివ్వలేదంటే ఒట్టు!! బియాన్స్ కోసం ప్రత్యేకించి అబు జానీ-సందీప్ కోస్లా ఈ డిజైనర్ దుస్తుల్ని డిజైన్ చేశారట.