Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: సమంత ఇంటెన్స్ అవతార్

By:  Tupaki Desk   |   22 July 2018 9:37 AM GMT
ఫస్ట్ లుక్: సమంత ఇంటెన్స్ అవతార్
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్లో తొలిసారిగా చేసిన పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో ‘యు టర్న్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈ రోజు లాంచ్ చేశారు. సమంత ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత సీరియస్ గా కనిపిస్తోంది ఈ ఫస్ట్ లుక్ లో. చాలా ఇంటెన్స్ గా ఉంది ఆమె లుక్. తీక్షణంగా కనిపించే ఆమె కళ్లు సినిమాలోని సీరియస్ నెస్ ను తెలియజేస్తున్నాయి. ముక్కుపుడకతో కొత్తగానూ కనిపిస్తోంది సామ్. ఆమె ముఖం పైకి పులుముకుంటున్న ఎరుపు రంగు ఇదొక మర్డర్ మిస్టరీతో ముడిపడ్డ కథ అనే విషయం చెప్పకనే చెబుతున్నాయి. కుడివైపు సిటీ రోడ్డు పై దూసుకొస్తున్న కారు కూడా కథలోని కీలకాంశాన్ని సూచించేలా ఉంది.

కన్నడలో విజయవంతమైన ‘యు టర్న్’ మూవీకి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘లూసియా’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ తీసిన రెండో సినిమా ‘యు టర్న్’. అక్కడ పారుల్ యాదవ్ ప్రధాన పాత్ర పోషించింది. ఒక యు టర్న్ దగ్గర తరచుగా ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతుండటంతో దానిపై హీరోయిన్ పరిశోధన జరిపి గుట్టు బయటపెట్టే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం ఒకేసారి తెరకెక్కింది. సమంత ఈ చిత్రంపై చాలా మనసు పడి.. తనే నిర్మాతల్ని సమకూర్చి ఈ చిత్రంలో నటించింది. ఇందులో ఆది పినిశెట్టి.. భూమిక చావ్లా.. రాహుల్ రవీంద్రన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బేనర్ మీద శ్రీనివాస చిట్టూరి.. రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.