Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోపై విమర్శలు.. ఆయన తప్పేం లేదు

By:  Tupaki Desk   |   23 April 2019 5:36 AM GMT
స్టార్‌ హీరోపై విమర్శలు.. ఆయన తప్పేం లేదు
X
తమిళ స్టార్‌ హీరో అజిత్‌ సింప్లి సిటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్లుగా ఉంటాడు. ఎక్కడకు వెళ్లినా కూడా చాలా సింపుల్‌ గా అజిత్‌ వెళ్తూ ఉంటాడు. ఇక ఎన్నికల సమయంలో అజిత్‌ లైన్‌ లో నిలబడి మరీ తన ఓటు హక్కును వినియోగించుకోవడం మనం గతంలో పలు మార్లు చూశాం. ఒక సామాన్య వ్యక్తిగా అజిత్‌ క్యూ లైన్‌ లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకోవడం ఆయన సింప్లిసిటీని చూపిస్తుంది. ఆ ఫొటోలు ఆమద్య నెట్‌ లో తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అజిత్‌ క్యూ లైన్‌ లో నిలబడకుండా నేరుగా లోనికి వెళ్లి ఓటు వేయడం వివాదాస్పదం అయ్యింది.

అజిత్‌ మరియు ఆయన భార్య షాలిని కలిసి తిరువాన్మయూర్‌ పోలింగ్‌ బూత్‌ కు వెళ్లారు. కొన్ని కారణాల వల్ల అక్కడ పోలింగ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. అజిత్‌ వెళ్లే సమయంకు అక్కడ పెద్ద ఎత్తున జనాలు మరియు ఆయన అభిమానులు గుమ్మి గూడారు. దాంతో పోలీసులు అజిత్‌ ను క్యూ లైన్‌ లో నిల్చుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, చాలా ఎక్కువ సమయం అజిత్‌ క్యూ లో ఉండటం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించి ఆయన్ను నేరుగా లోనికి తీసుకు వెళ్లి ఓటు వేయించి, పంపించారు. అయితే తాము బయట ఎదురు చూస్తుంటే, ఆయన్ను మాత్రం లోనికి తీసుకు వెళ్లి ఓటు వేయించడం ఏంటీ అంటూ కొందరు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసులను అజిత్‌ ను తిట్టిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయమై కొందరు అజిత్‌ ను విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం విషయంలో అందరు సమానులే, అలాంటప్పుడు ఎలా మీరు ముందు వెళ్లి ఓటు వేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

అజిత్‌ ఎప్పటి మాదిరిగానే క్యూలో నిల్చుని ఓటు వేయాలని భావించాడు. కాని ఆయన వల్ల అక్కడ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో పోలీసులు లోనికి తీసుకు వెళ్లారు, తన వల్ల ఇబ్బంది వద్దని భావించిన అజిత్‌ క్యూ లైన్‌ లో నిల్చోవాలనుకున్నా కూడా పోలీసుల సూచన మేరకు నేరుగా లోనికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇందులో అజిత్‌ తప్పేం లేదు అంటూ అభిమానులు అంటున్నారు. సెలబ్రెటీలు మరియు రాజకీయ ప్రముఖులు వచ్చిన సమయంలో పోలింగ్‌ బూత్‌ వద్ద హడావుడి ఉండకుండా వారితో వెంటనే ఓటు వేయించాలంటూ ఉన్నతాధికారులు పోలింగ్‌ అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అజిత్‌ తో ఓటు వేయించారు. ఇందులో విమర్శలు చేయడానికి ఏమీ లేదు. కొందరు కావాలని అజిత్‌ యాంటీ ఫ్యాన్స్‌ దుమారం పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.