Begin typing your search above and press return to search.

‘అజ్ఞాతవాసి’పోయినా ‘అ’దే సెంటిమెంటు

By:  Tupaki Desk   |   20 May 2018 10:10 AM GMT
‘అజ్ఞాతవాసి’పోయినా ‘అ’దే సెంటిమెంటు
X
సినీ రంగంలో సెంటిమెంట్లకు కొదవే ఉండదు. 24 క్రాఫ్టుల్ని నడిపించే దర్శకుల్లోనూ చాలామంది సెంటిమెంటు దాసులే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆయనకు తన టైటిళ్ల విషయంలో ఒక సెంటిమెంటు ఉంది. ఎక్కువగా తన చిత్రాలకు ‘అ’ అక్షరం కలిసొచ్చేలా టైటిళ్లు పెడుతుంటాడు మాటల మాంత్రికుడు.

తన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమాకు ‘అతడు’ అనే పేరు పెట్టాడు. అది విజయవంతమైంది. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’.. ‘అఆ’ లాంటి టైటిళ్లతో వచ్చాడు. అవి కూడా భారీ విజయాలు సాధించాయి. దీంతో సెంటిమెంటును కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ తో చేసిన తన చివరి సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే పేరు పెట్టాడు. కానీ ఈసారి సెంటిమెంటు పని చేయలేదు. ఆ సినిమా దారుణ ఫలితాన్నందుకుంది. అయినప్పటికీ త్రివిక్రమ్ సెంటిమెంటు నుంచి బయటికి రాలేదు. తన కొత్త సినిమాకు ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే పేరు నిర్ణయించాడు.

నిజానికి ఈ టైటిల్లో సబ్జెక్ట్ ‘వీర రాఘవ’ అయినప్పటికీ సెంటిమెంటు దృష్ట్యా ‘అరవింద సమేత’నే మెయిన్ టైటిల్ చేసి.. ‘వీర రాఘవ’ను క్యాప్షన్ లాగా మార్చేసినట్లున్నాడు త్రివిక్రమ్. మరి ఈసారి సెంటిమెంటు వర్కవుటవుతుందా లేదా అన్నది చూడాలి. ఎన్టీఆర్-త్రివిక్రమ్ తొలిసారి కలిసి పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆయన మిత్రుడు రాధాకృష్ణనే ఈ చిత్రానికీ ప్రొడ్యూసర్. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.