Begin typing your search above and press return to search.

బన్నీ కథ మళ్ళీ మొదటికే!

By:  Tupaki Desk   |   18 Nov 2018 7:11 AM GMT
బన్నీ కథ మళ్ళీ మొదటికే!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల ఎదురుచూపులకు ఇంకొంత కాలం బ్రేక్ పడేలా లేదు. నా పేరు సూర్య విడుదలై ఆరు నెలలు దాటినప్పటికీ బన్నీ ఇంకా తన కొత్త సినిమా సంగతి ఎటూ తేల్చకపోవడం బాగా ఇబ్బంది పెడుతోంది. విక్రం కుమార్ తో డ్రాప్ అయ్యాక ఇంకెవరితో ఉంటుందన్న ఊహాగానాలకు త్రివిక్రమ్ రూపంలో చెక్ పడింది. అటు అల్లు అర్జున్ కాని ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ అధికారికంగా దీని గురించి ఎక్కడా చెప్పకపోయినా అఫ్ ది రికార్డు కన్ఫర్మ్ అయ్యిందన్న మాట నిజం. స్క్రిప్ట్ కూడా రిస్క్ లేకుండా హిందిలో సూపర్ హిట్ గా నిలిచిన సోను కి టిటు కి స్వీటీకి తెలుగుకు తగ్గట్టు కీలక మార్పులు చేయాలనీ తొలుత భావించారు.

ఆ మేరకు సదరు నిర్మాణ సంస్థ టి సిరీస్ ను హక్కుల కోసం సంప్రదించారు. రెండు రాష్ట్రాల్లో బలమైన మార్కెట్ ఉన్న బన్నీ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే వాళ్ళకూ ఆశ పుట్టింది కాబోలు. హక్కులు అమ్మం మేమూ పార్టనర్ గా ఉంటామని ప్రతిపాదన పెట్టేసారు. అప్పటికే ఇది గీతా బ్యానర్ మీద రూపొందాలా లేక హారికా హాసినితో సోలోగా చేయాలా అనే విషయం తేలక సతమతమవుతున్న త్రివిక్రమ్ ఈ తలనొప్పి ఎందుకులెమ్మని పూర్తిగా డ్రాప్ అయినట్టు ఫిలిం నగర్ టాక్. ఇక అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్టు కొత్త కథ వండే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరు చేసిన జులాయి-సన్ అఫ్ సత్యమూర్తి రెండూ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. హింది డబ్బింగ్ వెర్షన్లు ఆన్ లైన్ లో రికార్డులు సృష్టించాయి. ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది కాబట్టి సహజంగానే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.

అందుకే త్రివిక్రం స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ కారణంగానే అనౌన్స్ చేయడంలో జాప్యం జరుగుతోందని తెలిసింది. పాత్ర ఎలా ఉండబోతోంది అనే క్లారిటీ లేకపోవడంతో అల్లు అర్జున్ తన ఒరిజినల్ హెయిర్ స్టైల్ కి వచ్చేసాడు. లైన్ కన్ఫర్మ్ అయ్యాక లుక్ ని ఎలా మార్చుకోవాలి అనేదాని గురించి క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పటిదాకా వేచి చూడక తప్పదు. మరి ప్రకటన డిసెంబర్ లో వస్తుందా లేక స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకుని జనవరిలో స్టార్ట్ చేస్తారా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది