Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్‌ తో సినిమా ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:30 PM GMT
త్రివిక్ర‌మ్‌ తో సినిమా ఉంద‌ట‌!
X
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో క‌లిసి సినిమా చేయాల‌ని ప్ర‌తీ క‌థానాయ‌కుడు కోరుకొంటాడు. ఆయ‌న సినిమాల్లో న‌టిస్తే మాస్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతారన్న‌మాట‌. అయితే ఆ అవ‌కాశాన్ని నాగ‌చైత‌న్య తృటిలో చేజార్చుకొన్నాడు. ప్ర‌స్తుతం సెట్స్‌పైనున్న `అఆ`కి ముందు త్రివిక్ర‌మ్ నాగ‌చైత‌న్య‌తోనే సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల అది కుద‌ర్లేదు. దీంతో ఆ అవ‌కాశం అనూహ్యంగా నితిన్‌ కి ల‌భించింది. దాంతో నాగ‌చైత‌న్య ఏమ‌నుకొన్నాడో తెలియ‌దు కానీ.. అక్కినేని అభిమానులు మాత్రం నిరుత్సాహ‌ప‌డ్డారు. మ‌ళ్లీ త్రివిక్ర‌మ్‌ - నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ సెట్ట‌య్యేది ఎప్పుడో అని నిట్టూర్చారు. అయితే అక్కినేని అభిమానుల‌కో శుభ‌వార్త‌. త్రివిక్ర‌మ్‌ - చైతూ క‌ల‌యిక‌లో సినిమా ఉంటుంద‌ట‌. అది కూడా `అఆ` పూర్త‌య్యాకేన‌ట‌.

చాలామంది నితిన్‌ తో తీస్తున్న `అఆ` క‌థ నాగ‌చైత‌న్య‌కోసం త‌యారు చేసిందే అనుకుంటున్నారు. కానీ చైతూకోసం రాసిన క‌థ త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర అలాగే ఉంద‌ట‌. నితిన్‌కోసం కొత్త‌గా అఆ క‌థ రాసుకొన్నార‌ట‌. ఆ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా తీస్తాన‌ని మాట‌కూడా ఇచ్చాడ‌ట‌. ఇది నిజంగా అక్కినేని అభిమానుల‌కి తీపి క‌బురే! నిజానికి త్రివిక్ర‌మ్ మ‌హేష్‌ బాబు - ప‌వ‌న్‌ కళ్యాణ్‌ ల‌తో సినిమా చేయాలి. కానీ ప‌రిస్థితి చూస్తుంటే ఆ ఇద్ద‌రూ ఇప్ప‌ట్లో ఖాళీ అయ్యేలా లేరు. ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ త‌ర్వాత కొంత‌కాలం పాటు రాజ‌కీయ వ్య‌వ‌హారాల కోసం స‌మ‌యం కేటాయించ‌బోతున్నార‌ట‌. మ‌హేష్ కూడా మురుగ‌దాస్ - పూరి మొద‌లుకొని బోలెడుమంది ద‌ర్శ‌కుల్ని లైన్లో పెట్టారు.

మ‌రో ప‌క్క త్రివిక్ర‌మ్ రెండు నెల‌ల్లోనే `అఆ`ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆ త‌ర్వాత చైతూకోసం త‌యారు చేసిన స్క్రిప్టుని బ‌య‌టికి ఆయ‌న‌తోనే సినిమా చేయ‌బోతున్న‌ట్టు అన్న‌పూర్ణ కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.