Begin typing your search above and press return to search.

త్రిష ఫ్రీగా చేస్తానంటోంది.. ఒప్పుకుంటాడా?

By:  Tupaki Desk   |   30 Nov 2015 7:35 AM GMT
త్రిష ఫ్రీగా చేస్తానంటోంది.. ఒప్పుకుంటాడా?
X
సౌత్ ఇండియన్ సినిమాను ఏలిన హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగులో చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - రవితేజ.. ఇంతమంది స్టార్ హీరోలతో నటించింది త్రిష. అటు తమిళంలోనూ కమల్ హాసన్ - విజయ్ - అజిత్ - సూర్య - విక్రమ్ లాంటి బడా హీరోలతోనూ ఆడిపాడింది ఈ చెన్నై బ్యూటీ. కానీ ఇంతమందితో చేసిన త్రిషకు సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసే అవకాశం మాత్రం రాలేదు. గతంలో ఒకట్రెండుసార్లు సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది. ఐతే ఇప్పుడు మాత్రం ఎలాగైనా ఒక్కసారి రజినీ పక్కన నటించి హ్యాపీగా రిటైరైపోవాలని గట్టి ప్రయత్నమే చేస్తోందట త్రిష.

ప్రస్తుతం ‘కబాలి’లో నటిస్తున్న రజినీకాంత్.. దీని తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘రోబో-2’ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అమీ జాక్సన్ ఓ కథానాయికగా నటిస్తుండగా.. ఇంకో హీరోయిన్ కు కూడా చోటుందట. ఆ పాత్ర కోసం త్రిష గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రిష వయసు 32 ఏళ్లు. కొన్ని అవకాశాలైతే చేతిలో ఉన్నాయి కానీ.. ఇంకెంతో కాలం కెరీర్ ను కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే రజినీతో ఒకసారి నటించేస్తే ఓ పనైపోతుందని.. ఆ తర్వాత హ్యాపీగా రిటైరైపోవచ్చని అనుకుంటోందట త్రిష. ఈ సినిమాలో అవకాశమిస్తే తనకు పారితోషకం కూడా అక్కర్లేదని కూడా అంటోందట. మరి త్రిష ఆఫర్‌ కు దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.