Begin typing your search above and press return to search.

బర్త్ డే నాడు త్రిషను మోసం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   4 May 2016 9:30 AM GMT
బర్త్ డే నాడు త్రిషను మోసం చేస్తున్నారు
X
మే 4.. చెన్నై బ్యూటీ త్రిష పుట్టిన రోజు. ఈ రోజుతో త్రిష 33 ఏళ్ల వయసు పూర్తి చేసుకుంటోంది. దీంతో త్రిషకు బోలెడంత మంది విషెస్ చెప్పేస్తూ.. ఎవర్ గ్రీన్ హీరోయిన్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంత సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కొనసాగగలగడం త్రిషకు మాత్రమే సాధ్యం అంటున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా.. ఇది కరెక్ట్ కాదనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి.

త్రిష మెయిన్ హీరోయిన్ వచ్చిన సినిమాల్లో.. ఆమె స్టాండర్డ్ కు తగ్గ మూవీ 2012లో ఎన్టీఆర్ తో చేసిన దమ్ము. ఆ తర్వాత ఇప్పటివరకూ ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ సినిమా లేదు. గతేడాది బాలయ్యతో లయన్ - కమల్ తో చీకటి రాజ్యం చేసినా.. అవేమీ కెరీర్ కి ఉపయోగపడలేదు. ఇప్పుడు నాయకి అంటూ హారర్ కామెడీ చేసేసి మళ్లీ ట్రాక్ లోకి వచ్చేస్తుందని అంటున్నా అదేమీ జరిగే పని కాదు. గీతాంజలితో సక్సెస్ కొట్టిన అంజలి - గంగతో హిట్ సాధించిన తాప్సీ పరిస్థితి చూస్తూనే ఉన్నాం కదా.

ఇప్పటికీ త్రిషను ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనే భ్రమల్లో ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. ఇది ఆమెను ఎటూ తేల్చుకోలేని పరిస్థితులకు గురిచేస్తోంది. వాస్తవంలోకి వచ్చేలా ఆమెకు సరైన గైడెన్స్ లేదనే టాక్ వినిపిస్తోంది. తన ఏజ్ కి, ట్యాలెంట్ కి తగ్గ పాత్రల్లోకి ఛేంజ్ అయ్యేలా త్రిష రూట్ వేసుకుంటే.. మరింత కాలం ఇండస్ట్రీలో కొనసాగచ్చనేది ఒప్పుకోవాల్సిన నిజం.