అనుపమ-ప్రకాష్ రాజ్.. అసలేం జరిగింది?

Wed Jul 11 2018 15:16:16 GMT+0530 (IST)

యువ కథానాయకుడు రామ్ కొత్త సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు.. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవ జరిగిందని.. ప్రకాష్ రాజ్ తిట్టడంతో అనుపమ బాగా హర్టయిందని.. ఆమె బాగా ఏడ్చిందని కొన్ని రోజుల కిందట రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఐతే ఇదంతా ఉత్త ప్రచారమే అని చెబుతూ.. ప్రకాష్ రాజ్ తో సరదాగా ఉన్న ఒక ఫొటోను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతటితో ఈ వ్యవహారానికి తెరపడినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయంలో కొత్త ప్రచారం ఒకటి మొదలైంది. ప్రకాష్ రాజ్ తో గొడవ అనంతరం అనుపమ బాగా హర్టయిందని.. ఏడ్చి ఏడ్చి నీరసించి పోయి సెట్లో కింద పడిపోయిందని.. ఆమెను ఆసుపత్రికి కూడా తరలించాల్సి వచ్చిందని ఊహాగానాలు వచ్చాయి.ఐతే ఈ రూమర్లు ఎంతకీ ఆగేట్లు లేకపోవడంతో దర్శకుడు త్రినాథరావు నక్కిన లైన్లోకి వచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశాడు. అనుపమ ఆ రోజు ఆసుపత్రికి వెళ్లిన మాట వాస్తవమే అని ఆయన అంగీకరించాడు. కానీ అందుకు కారణం వేరే అన్నాడు. అనుపమ ఆ రోజు అలసటతో నీరసంగా ఉందని.. దీనికి తోడు ఫుడ్ పాయిజన్ కూడా కావడంతో ఆమె అనారోగ్యం పాలైందని.. దీంతో స్టూడియోలోనే ఉన్న ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లామని చెప్పాడు త్రినాథరావు. నిజానికి ఆ రోజుతో ప్రకాష్ రాజ్ డేట్లు అయిపోతుండటంతో.. ఆయన కాంబినేషన్లో తీయాల్సిన సీన్ల కోసం అనుపమ మళ్లీ సెట్ కు వచ్చిందని.. ప్రకాష్ రాజ్ వద్దని వారించినా వినకుండా ఆయనతో కలిసి షూటింగ్ లో పాల్గొందని.. అంతే తప్ప వాళ్ల మధ్య ఎలాంటి గొడవా జరగలేదని ఆయన స్పష్టం చేశాడు. మరి దర్శకుడే స్వయంగా వివరణ ఇచ్చాకైనా ఈ ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి.