టాప్ స్టోరి: మూడు ముక్కలాట!?

Thu Dec 13 2018 10:35:30 GMT+0530 (IST)

వారం వారం సినిమాల జాతర గురించి చెప్పాల్సిన పనేలేదు. ఒకదాని వెంట ఒకటిగా రిలీజ్ లకు వస్తున్నాయి. ఇక సంక్రాంతి బరిలో భారీ క్రేజీ చిత్రాలు రిలీజ్ లకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్- వినయ విధేయ రామా- వెంకీ మామ- పెట్టా- విశ్వాసం ఇన్ని సినిమాలు ఉన్నాయి. వీటన్నిటి పోటీ నడుమ బరిలో దిగలేని సినిమాలన్నీ ఈ డిసెంబర్ లో జాతరకు రెడీ అవుతున్నాయి. సరైన రిలీజ్ తేదీకి వస్తే కనీసం డిపాజిట్లు దక్కుతాయని కొందరనుకుంటే - తాము నమ్మిన కంటెంట్ గెలుస్తుందని నమ్మి వార్ జోన్ లోకి వస్తున్నారు కొందరు.అలాంటి వాటిలో ఓ మూడు సినిమాలు ఇటీవల ఫిలిం సర్కిల్స్ తో పాటు - అటు కామన్ ఆడియెన్ లోనూ ఆసక్తిని పెంచాయి. ఈ శుక్రవారం భైరవగీత- హుషారు లాంటి సినిమాలు `ఓడియన్` (మోహన్ లాల్) లాంటి భారీ అనువాద చిత్రంతో పోటీపడుతున్నాయి. అలాగే హాలీవుడ్ సినిమా ఆక్వామేన్ 3డి రిలీజ్ బరిలో ఉంది. ఈ సినిమాల తర్వాత వచ్చే వారం మరో మూడు క్రేజీ సినిమాలు బరిలోకొస్తున్నాయి. ఈ నెల 21న మూడు సినిమాలు యువతరంలో వాడి వేడిగా చర్చకొచ్చాయి.

వీటిలో ఒకటి ప్రయోగాత్మక చిత్రం.. ఇంకోటి భారీ యాక్షన్ చిత్రం .. వేరొకటి పూర్తి ప్రేమకథా చిత్రం.. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లు అనే చెప్పాలి. అయితే ఈ మూడింట్లో ఏ సినిమా సత్తా ఎంత? అన్నది తేల్చాల్సింది ఆడియెన్. ఇక వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి బృహత్తర ప్రయత్నం `అంతరిక్షం`పై జనాల అటెన్షన్ ఉంది. ఘాజీ లాంటి సంచలనం తర్వాత సంకల్ప్ తీస్తున్న ఈ సినిమా పై నిర్మాతలు క్రిష్- రాజీవ్ రెడ్డి ఎంతో నమ్మకం వెలిబుచ్చారు. తెలుగు తెర పైనే తొలి స్పేస్ మూవీ ఇది. భారీ సెట్స్ లో 70 రోజుల పాటు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పరిమిత బడ్జెట్ చిత్రాల్లో మెరిక లాంటి సినిమాని అందిస్తున్నామని దర్శకనిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక కన్నడ హీరో యశ్ నటించిన కె.జి.ఎఫ్ ఇప్పటికే టాలీవుడ్ లోనూ బజ్ క్రియేట్ చేసింది.

బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రచారంతో - వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేస్తుండడంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. ఇది భారీ మాఫియా యాక్షన్  సినిమా కావడంతో థియేటర్లలో గూస్ బంప్స్ తప్పదని మాస్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ రెండిటితో శర్వా `పడి పడి లేచే మనసు` ఎంతగా పోటీ ఇస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. శర్వానంద్ - సాయి పల్లవి జంట ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ - రొమాన్స్ ఇప్పటికే యూత్ లోకి దూసుకెళ్లాయి. ఆ జంట లవ్ స్టోరి తెరపై ఉత్కంఠ పెంచుతుందనే అంచనాలున్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో ఇంతవరకూ భారతీయ తెర పై చూడని కొత్త పాయింట్ చూపిస్తున్నామని చిత్రయూనిట్ చెబుతుండడంతో ఉత్కంఠ పెరుగుతోంది. అందాల రాక్షసి- లై వంటి క్లాస్సీ చిత్రాలు తెరకెక్కించిన హను రాఘవపూడి ఈసారి పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మరి ఈ మూడు ముక్కలాట ఎలా ఉండబోతోందో చూడాలి. అన్నట్టు వీటన్నిటికీ షారూక్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా `జీరో` మెట్రోల్లో పోటీనిస్తుందేమో చూడాలి. జీరో ఈనెల 21న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం సంగతేమో కానీ వచ్చే శుక్రవారం సినిమాల సంగతేంటి? అన్న ముచ్చటా ఇప్పటికే క్రిటిక్స్ లో సాగుతోంది.