Begin typing your search above and press return to search.

రాజమౌళికి ఆ దర్శకురాలు ఫ్యాన్

By:  Tupaki Desk   |   20 Jan 2018 2:30 AM GMT
రాజమౌళికి ఆ దర్శకురాలు ఫ్యాన్
X
‘మగధీర’.. ‘ఈగ’.. ‘బాహుబలి’ సినిమాలతో ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగాడు రాజమౌళి. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో అతను సంపాదించిన కీర్తి అంతా ఇంతా కాదు. శేఖర్ కపూర్ లాంటి హాలీవుడ్ దర్శకుడు కూడా రాజమౌళికి అభిమానిగా మారిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు మన జక్కన్న. తాజాగా టోప్ ఓషిన్ అనే నైజీరియా అవార్డ్ విన్నింగ్ లేడీ డైరెక్టర్ రాజమౌళికి అభిమానిగా మారింది. ఆమె ఈ మధ్యే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇంటర్నేషనల్ వెర్షన్ చూసిందట. ఆ సినిమా చూసి ఫిదా అయిపోయానంటూ ఆమె సోషల్ మీడియాలో రాజమౌళిపై ప్రశంసలు కురిపించింది.

‘‘రాజమౌళికి ఇప్పుడు కొత్త ఫిలిం మేకింగ్ ఫ్యాన్ దొరికాడు. బాహుబలి సినిమా చూసి చాలా ఆస్వాదించాను. బాధ.. సంతోషం.. ఉద్వేగం.. ఆశ్చర్యం.. ఇలా ఎన్నో భావనలు కలిగాయి. నా మీద ఇప్పుడు బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. నేను రాజమౌళికి చాలా పెద్ద అభిమానిని అయిపోయాను’’ అని ఓషిన్ తెలిపింది. ‘బాహుబలి’ చూసి ఫిదా అయిన తనకు ఒక వ్యక్తి ‘ఈగ’ సినిమా కూడా చూడమని సలహా ఇచ్చాడని.. త్వరలోనే అది కూడా చూడబోతున్నానని ఓషిన్ తెలిపింది. మరోవైపు ‘బాహుబలి: ది కంక్లూజన్’ జపనీస్.. రష్యన్ వెర్షన్లు ఈ మధ్యే రిలీజయ్యాయి. రష్యాలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపకపోగా.. జపాన్ లో మాత్రం మంచి వసూళ్లు రాబడుతున్నట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.