దర్శకుల వారసులు హీరోలు కాలేరా ?

Fri Aug 10 2018 07:00:27 GMT+0530 (IST)

తండ్రులు ఎంత గొప్ప వారైనా పిల్లలు అదే స్థాయిని చేరుకోవడం లేదా అంతకు మించి వెళ్లడం అన్నిసార్లు సాధ్య పడదు. సినిమా పరిశ్రమలోనూ అంతే. వారసత్వం కార్డు ఉన్నంత మాత్రాన ఎంట్రీ దొరుకుతుందేమో కానీ టాలెంట్ మాత్రం ఎవరికి వాళ్ళు చూపించుకోవాల్సిందే. లేదంటే ప్రేక్షకులు గుడ్డిగా నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ విషయం ఇప్పుడే కాదు  గతంలో కూడా చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా దర్శకుల తనయులు హీరోలుగా ప్రయత్నాలు చేసినప్పుడు ఫలితం ఎప్పుడూ పాజిటివ్ గా  రాలేదు. ఉదాహరణలు చరిత్రలో చాలానే ఉన్నాయి.150 సినిమాలకు దర్శకత్వం వహించి సినిమా చరిత్రలో తన స్థానాన్ని ప్రత్యేకంగా లిఖించుకున్న  దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి అబ్బాయి అరుణ్ కుమార్ ఎంట్రీ గ్రీకువీరుడుతో గ్రాండ్ గా జరిగినా ఆ తర్వాత ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. ఒక్క క్షణంతో విలన్ గా ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదు. మాస్ సినిమాకు కొత్త నడకలు నేర్పిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి వారసుడు సూర్య ప్రకాష్ నీతో అనే సినిమాతో లాంచ్ అయినా మొదటి దెబ్బకే యు టర్న్ ఇవ్వాల్సి వచ్చింది. దర్శకుడిగా కూడా సక్సెస్ కాలేకపోయారు.

ఇక చిరంజీవి లాంటి హీరోకు ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ ఇప్పటికీ నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు. రవిరాజా పినిశెట్టి పుత్రుడు ఆది పినిశెట్టి విలన్ గా సపోర్టింగ్ రోల్స్ లో మంచి పేరు తెచ్చుకుంటున్నా హీరో గా మాత్రం గెలవలేకపోతున్నాడు. త్వరలో విజయ్ భాస్కర్ తనయుడు కమల్ పరిచయం జరగబోతోంది. త్రివిక్రమ్ రచయితగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ లాస్ట్ హిట్ ప్రేమ కావాలి. మరి పైన చెప్పిన వాళ్లందరికీ దక్కని సక్సెస్ కమల్ ఎంత వరకు దక్కించుకుంటాడో చూడాలి. కథ ఇప్పటికే రెడీ అయ్యిందట. షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.