Begin typing your search above and press return to search.

రీమేక్స్ రిపీటవుతున్నాయ్.. అక్కడా ఇక్కడా

By:  Tupaki Desk   |   17 Oct 2017 10:30 PM GMT
రీమేక్స్ రిపీటవుతున్నాయ్.. అక్కడా ఇక్కడా
X
వెండితెర అంటేనే అద్భుతం. ఊహించని కళలకు అది ఒక ప్రపంచం. అలాంటి అద్భుతమైన తెరపైన చూసిన ప్రపంచాన్నే చూడాలంటే కొంచెం బోరింగ్ అని చెప్పాలి. అందుకే మన దర్శకులు కొత్త ప్రపంచం అనే కథలను అల్లుతున్నారు. బడ్జెట్ చిన్నదైనా కథ అనే మనిషి ప్రపంచాన్ని మనసుకు నచ్చేలా తీస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో కూడా ఇదే తరహాలో చాలా వరకు కథలు పుట్టుకొస్తున్నాయి.

అంతే కాకుండా టాలీవుడ్ లో హిట్ అయిన ఆ చిన్న కథలు పరభాషా ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు ఎంతో ఇష్టంగా రీమేక్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు మాత్రమే రీమేక్ అయ్యేవి కానీ ఇప్పుడు చిన్న హీరోల సినిమాలు కూడా చాలా వరకు రీమేక్ అవుతున్నాయి. 2011 లో వచ్చిన 100% లవ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతోంది. లక్కీ గర్ల్ షాలిని పాండే హీరోయిన్ కాగా.. యువ సంగీత దర్శకుడు జివి. ప్రకాష్ కుమార్ హీరో. ఇక రీసెంట్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి కూడా తమిళ్ లో రీమేక్ అవుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా బాలా తెరకెక్కిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ తారలు కూడా ఆ సినిమాపై కన్నేశారు.అదే తరహాలో విజయ్ దేవరకొండ మరో మూవీ పెళ్లి చూపులు కూడా కోలీవుడ్ లో రీమేక్ కావడానికి సిద్ధమవుతోంది. గౌతమ్ మీనన్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇకపోతే పరభాషా సినిమాలు ఎప్పటిలానే తెలుగులో రీమేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. వాటిలో చిన్న బడ్జెట్ లో తెరకెక్కి మినిమమ్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటి సారి ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 100కోట్లు దాటించిందంటే అదే కంగనా 'క్వీన్' చిత్రమే.. ఆ సినిమా కేవలం 12 కోట్లతో తెరకెక్కింది. ఇక ఆ సినిమాను తెలుగులో తమన్నా చేస్తోంది. అలాగే మొదటి సారి మరాఠీ సినిమాలకు 100 కోట్ల రుచిని చూపించిన సైరత్ మూవీ కూడా తెలుగులో రీమేక్ అవ్వనుందని టాక్. ఇక మలయాళం సూపర్ హిట్ మూవీ 'విక్రమ్‌ వేదా’ ఇప్పటికే రీమేక్ పనులను స్టార్ట్ చేసుకుంది. మొదట వంకటేష్ హీరో అనే టాక్ వినిపించింది. కానీ వెరైటీగా సునీల్ సినిమాలో కనిపించోబుతున్నాడు.

కోలీవుడ్ అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ వేదాళం కూడా త్వరలోనే సెట్స్ పైకి రానుందని పవన్ కళ్యాణ్ హీరో అంటున్నారు. ఇంతకముందు పవన్ - కాటమరాయుడు అజిత్ - వీరమ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. మళ్లీ అదే తరహాలో తెరకెక్కించనున్నారని టాక్. కాని ఈ మూవీపై ఇంకా క్లారిటీ లేదులే. ఇక బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచినా సుల్తాన్ కూడా టాలీవుడ్ లో వెంకీ రీమేక్ చేయనున్నాడని టాక్. మరి ఈ రీమేక్ సినిమాలు పట్టాలు ఎప్పుడు ఎక్కుతాయో చూడాలి.