Begin typing your search above and press return to search.

ఈగోల గొడవల్లో నిర్మాత?

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:30 PM GMT
ఈగోల గొడవల్లో నిర్మాత?
X
ఏ రంగమైనా సక్సెస్ ఉన్నంతవరకు లోపలున్నది బయటికి కనిపించదు. తెరవెనుక నిజాలన్నీ కప్పబడిపోతాయి. దీనికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రస్తుతం ఒక టాప్ ప్రొడక్షన్ కంపెనీ గురించి ఇలాంటి టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో జోరుగా నడుస్తోంది. ఆయనో అగ్ర నిర్మాత. ఇప్పటి దాకా పాతిక పైగా సినిమాలు తీసి అగ్ర నిర్మాతగా తాంబూలం అందుకుంటున్నాడు. ఒకే ఏడాది ఆరు సక్సెస్ లు కొట్టిన రికార్డు  ఉందని చెబుతూ ఉంటారు. అదలా ఉంచితే ఆయన సంస్థలో కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. తమ్ముడు అతని కొడుకు ఇలా బంధువులనే సెట్ చేసుకుని నడుపుతూ వచ్చారు. ఈ మధ్య కాస్త లెక్కలు తప్పాయి. మితిమీరిన నమ్మకంతో కేవలం కాంబోల మీద ఆధారపడి తీస్తున్న సినిమాలు వరుసగా దెబ్బ తింటున్నాయి. ఎన్ని పబ్లిసిటీ గిమ్మిక్కులు చేసినా ఆడటం లేదు సరికదా పెట్టిన పెట్టుబడి వస్తే చాలు మహాప్రభో అని కొన్నవాళ్ళు అనేదాకా వచ్చింది పరిస్థితి.

దీనికి చాలా కారణాలు ఉన్నాయని పైన చెప్పిన పుకార్ల టాక్. ఈగోలతో వాళ్ళ మధ్యే వాళ్లకు సరైన అండర్ స్టాండింగ్ లేదని సదరు నిర్మాత ఇచ్చిన రాంగ్ కమిట్మెంట్స్ వల్ల యావరేజ్ గా కూడా సినిమాలు ఆడలేని పరిస్థితి వచ్చిందని అభిప్రాయ భేదాలతో ఆ కాంపౌండ్ సతమతమవుతోందని టాక్. దీని ప్రభావం ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమా మీద కూడా పడిందని అందుకే దాని గురించి సరైన అప్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో హీరో కూడా కన్ఫ్యూజన్ లో పడ్డాడట. వరస ఫ్లాపుల ప్రభావంతో పాటు వర్క్ అవుట్ కాదని చెప్పినా తమ్ముడి కొడుకు ప్రేమ నేపథ్యంలో ఎనిమిది కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడం అది కాస్త డిజాస్టర్ కావడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ నిర్మాత ఇప్పుడు ఈ అంతర్గత గొడవల వల్ల సతమతమవుతున్నట్టు తెలిసింది. పుండు మీద కారం చల్లినట్టు ఇటీవలే తాను గొప్పగా తీశానని చెప్పుకున్న సినిమా చాలా నిరాశాజనకమైన ఫలితం ఇవ్వడం కూడా గొడవలకు దారి తీసింది అని తెలిసింది. ఏదేమైనా మొత్తానికి ఫెయిల్యూర్స్ సినిమా వాళ్ళ కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయన్న మాట.