Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టామినా చాటిన టాప్ 5

By:  Tupaki Desk   |   24 May 2018 7:20 AM GMT
టాలీవుడ్ స్టామినా చాటిన టాప్ 5
X
తెలుగు సినిమా హద్దులు చెరిపేసుకుంటోంది. పరిమితులు దాటుకుని మార్కెట్ ను అంతకంతా పెంచుకుంటూ పోతోంది. ఒకప్పుడు 50 కోట్ల షేర్ వస్తే అదే పెద్ద ఘనతగా భావించే రోజుల నుంచి వంద కోట్లు రాబట్టడం చాలా తేలికైన వ్యవహారంలా వరస సక్సెస్ లతో సత్తా చాటుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వంద కోట్ల షేర్ రాబట్టడం చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా నివ్వెరపోతున్నాయి. రీజనల్ సినిమా రేంజ్ ఈ స్థాయిలో ఉందా అని లెక్కలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిర్మాణంలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది. కంటెంట్ తో మెప్పిస్తే చాలు ప్రేక్షకులు కనకవర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే క్లారిటీ వచ్చేసింది కాబట్టి సాహో లాంటి భారీ వెంచర్లు ఇంకా బలమైన నమ్మకంతో ముందుకు వెళ్తున్నాయి. టాలీవుడ్ వైపు ఇప్పుడు అన్ని బాషా పరిశ్రమల కన్ను ఉందంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాల నిర్మాణాలు వాటి తాలూకు ప్రోగ్రెస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్ డేట్ అవుతున్నారు. రీమేక్ లేదా పంపిణి హక్కుల కోసం ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారు.

బాహుబలి వీటికి పునాది వేసింది అనుకున్నా అది పూర్తిగా ఫాంటసీ జానర్ కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో కలిపి చూడలేం. అది మినహాయిస్తే ఇటీవలి కాలంలో మంచి కంటెంట్ తో డిఫరెంట్ గా అనిపించే కమర్షియల్ ఎలెమెంట్స్ మిస్ కాకుండా తీస్తున్న సినిమాలకు బ్రహ్మరధం దక్కడం ఇక్కడ గమనించాల్సిన అంశం. రంగస్థలం తర్వాత భరత్ అనే నేను ఈజీగా వంద కోట్ల షేర్ ని అందుకోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక ఇప్పటిదాకా తెలుగులో వంద కోట్ల షేర్ దాటేసిన టాప్ 5 తెలుగు సినిమాల లిస్ట్ చూస్తే ట్రెండ్ ఎలా ఉందొ అర్థమవుతుంది

మొదటి స్థానం - బాహుబలి 2- 309 కోట్లు (తెలుగు వెర్షన్ తో)

రెండో స్థానం - బాహుబలి - 189 కోట్లు (తెలుగు వెర్షన్ తో)

మూడో స్థానం - రంగస్థలం - 127 కోట్లు

నాలుగో స్థానం - భరత్ అనే నేను - 105 కోట్ల 60 లక్షలు

ఐదో స్థానం - ఖైదీ నెంబర్ 150 - 102 కోట్లు

సెకండ్ ప్లేస్ లో ఉన్న బాహుబలిని పక్కన పెట్టి చూస్తే మిగిలిన నాలుగు సినిమాలు ఈ రెండేళ్ల వ్యవధిలో వచ్చినవే. అంటే కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే వంద కోట్ల షేర్ సినిమాలు నాలుగు వచ్చాయి. ఇది సింగల్ లాంగ్వేజ్ వెర్షన్ లో తీసుకుంటే రెండేళ్ల కాల వ్యవధికి ఏ బాషా పరిశ్రమలోనూ సాధ్య పడలేదు. అందుకే తెలుగు సినిమా వైపు ఇప్పుడు అందరి చూపు నిలుస్తోంది. ఇవి తాత్కాలికమేనని సైరా, సాహో వీటిని తిరగరాస్తాయని ఆ హీరోలతో పాటు అభిమానులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు