Begin typing your search above and press return to search.

హీరో టెన్షన్ - డైరెక్టర్ పరేషాన్

By:  Tupaki Desk   |   19 Sep 2018 1:21 PM GMT
హీరో టెన్షన్ - డైరెక్టర్ పరేషాన్
X
అతనో స్టార్ హీరో. పెద్ద ఫ్యామిలీ నుంచి రావడమే కాక తనకంటూ చాలా ఫాలోయింగ్ ఉంది. రెండు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఖాతాలో ఉన్నాయి. సరే ఓ మాస్ దర్శకుడు కలిసాడు. ఇంతకు ముందు కలిసి చేయలేదు కాబట్టి తనకూ ఓ హిట్ వస్తుందనే నమ్మకంతో ఓకే చెప్పాడు హీరో. కథ విన్నప్పుడు బాగానేఅనిపించింది. భారీ బడ్జెట్ తో పాటు భీభత్సమైన హింసను చూపడంలో మాస్టర్ అయిన ఆ దర్శకుడు గత చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పేలిపోయింది. తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో గుర్తించాడు. దానికి తగ్గట్టే ఇప్పుడు తీయబోయే సినిమాకు స్క్రిప్ట్ రాసానని హీరోని నమ్మించాడు. సరే శుభం అనుకుని సెట్స్ పైకి తీసుకెళ్లారు. సగం దాకా షూటింగ్ అయిపోతుంది. తీరా రషెస్ చూసుకుంటే రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా తప్ప సినిమాలో పెద్దగా తాను ఆశించినవి ఏమి లేవని హీరో గుర్తించి అదే దర్శకుడిని అడిగాడట.

దీంతో ఇలా తీస్తేనే మాస్ పల్స్ అందుకుంటామని రేపు థియేటర్స్ కు వసూళ్ల వర్షం కురిపించేవి ఇవేనని చెబుతున్నాడట. అయినా ఒకపక్క తనతో సహా హీరోలందరూ కొత్తగా ఆలోచిస్తూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటే తనను మరో ఐదారేళ్ళ వెనక్కు తీసుకెళ్లేలా రూపొందుతున్న సినిమా అవుట్ ఫుట్ చూసి ఇప్పుడు కాస్త సీరియస్ గానే దర్శకుడితో చర్చలో పడ్డాడట హీరో. ఇప్పటిదాకా తీసింది ఓకే కానీ ఇకపై తీయబోయే వాటిలో మరీ రొటీన్ అనిపించే మసాలాలు కామెడీ తీసేసి కాస్త ఫ్రెష్ గా ఏదైనా రాయమని చెప్పినట్టు టాక్. దీంతో దర్శకుడు పునరాలోచనలో పడి మార్పులకు సిద్ధపడినట్టు తెలిసింది. ఫిలిం నగర్ లో దీని గురించి కాస్త హాట్ గానే చర్చ నడుస్తోంది. ఒక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసమే వందల కొద్ది జూనియర్ ఆర్టిసులతో తీసిన యాక్షన్ ఎపిసోడ్ చూసాకే హీరో తన నిర్ణయాన్ని దర్శకుడికి చెప్పాడట. మరో నాలుగు నెలల్లో విడుదల ఉన్న ఈ సినిమాకు చెప్పుకోదగ్గ రిపేర్లు జరగబోతున్నాయని ఇన్ సైడ్ టాక్.