Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాలపై అతి చేస్తే అంతే సంగతులు

By:  Tupaki Desk   |   9 Dec 2017 11:30 PM GMT
డబ్బింగ్ సినిమాలపై అతి చేస్తే అంతే సంగతులు
X
‘2.0’ సినిమాను ఏప్రిల్‌ నెలకు వాయిదా వేయడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో అలజడి రేగింది. అందులోనూ ఈ సినిమా ఏప్రిల్ 27న రావచ్చన్న అంచనాలతో ‘భరత్ అను నేను’.. ‘నా పేరు సూర్య’ నిర్మాతల్లో కలవరం మొదలైంది. ఇలా ఎలా డేట్లు మారుస్తారంటూ ఓవైపు బన్నీ వాసు.. మరోవైపు డీవీవీ దానయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. మరోవైపు డబ్బింగ్ సినిమాలకు వ్యతిరేకంగా నిర్మాతల మండలిలో తీర్మానాలు జరగబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. పండగ సీజన్లలో.. పెద్ద సినిమాలు రిలీజవుతున్నపుడు తమిళ అనువాదాలు విడుదల కాకుండా నిబంధనలు పెడతారట.. ఒక వేళ ఆ సినిమాలు రిలీజైనా వందకు మించి థియేటర్లు ఇవ్వకూడదని కూడా షరతులు పెడతారట. కానీ ఓవైపు అల్లు అరవింద్ తమిళ నిర్మాత జ్నానవేల్ రాజాతో స్నేహం చేస్తూ.. అతడితో కలిసి ఇక్కడా అక్కడా సినిమాలు నిర్మిస్తూ.. సూర్య సినిమాలకు తెలుగులో సహకారమందిస్తూ.. ఇలా మిగతా తమిళ నిర్మాతల మీద పడటం సబబా అన్న చర్చ ఇప్పటికే నడుస్తోంది.

ఈ సంగతలా ఉంచితే.. ఈ మధ్య మన తెలుగు హీరోలకు తమిళ మార్కెట్ మీద కళ్లు పడ్డాయి. తమ సినిమాల్ని తమిళంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ద్విభాషా చిత్రాలకు కూడా సై అంటున్నారు. వీళ్లు ఓవైపు తమిళంలో మార్కెట్ విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ.. డబ్బింగ్ సినిమాలకు అడ్డం పడే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం అన్న చర్చ నడుస్తోంది. అసలు ‘2.0’పై డబ్బింగ్ సినిమా అనే ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. అది ట్రైలింగ్వల్ సినిమా. ‘స్పైడర్’ లాంటి వాటిని బైలింగ్వల్ అని చెప్పి.. తమిళంలోనూ పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తూ.. ‘2.0’కు డబ్బింగ్ ముద్ర వేస్తామంటే ఎలా సాధ్యం..? ‘2.0’ విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావడం వల్లే వాయిదా పడుతోందని అందరికీ తెలుసు. మరి ‘స్పైడర్’ సినిమాను మాత్రం మళ్లీ మళ్లీ వాయిదా వేసి లేటుగా రిలీజ్ చేయలేదా? ‘బాహుబలి’ మాత్రం ఆలస్యం కాలేదా? మరి ‘2.0’ విషయంలో మాత్రమే ఇలా మీద పడిపోవడం న్యాయమా అన్న చర్చ నడుస్తోంది. రేప్పొద్దున మనోళ్ల సినిమాలు కూడా తమిళంలోకి వెళ్తాయన్న సంగతి గుర్తుంచుకుని డబ్బింగ్ సినిమాల విషయంలో తీర్మానాలు చేయడం మంచిదని మన ఇండస్ట్రీ పెద్దలు గుర్తుంచుకోవాల్సిందే.