ఆ అగ్ర నిర్మాత బయటికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు?

Sun Apr 15 2018 23:54:44 GMT+0530 (IST)

ఆయన టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. ఆయన కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయన తరం నిర్మాతలు చాలామంది ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయారు. కానీ ఆయన మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చాలా కాల్కులేటెడ్ గా - తెలివిగా సినిమాలపై పెట్టుబడి పెడుతూ తన పట్టును చూపిస్తున్నారు. ఆయన చేతిలో చాలా థియేటర్లు కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ హౌజ్ కూడా ఉంది. సినీ పరిశ్రమ పెద్ద దిక్కుల్లో ఒకడిగా పేరున్న ఆయన.. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మీడియా ముందుకొస్తారు. తన అభిప్రాయం తెలియజేస్తారు. పెద్ద మనిషి తరహాలో మాట్లాడతారు. గత నెల సమ్మె కారణంగా థియేటర్లు మూత పడ్డ సమయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.ఐతే ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మీద మాత్రం ఆయన స్పందించడం లేదు. మామూలుగా అయితే ఆయన కచ్చితంగా ఈ వ్యవహారంపై మాట్లాడేవారు. అవసరమైతే ఎవరినైనా మందలించడం కూడా చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం మౌనం పాటిస్తున్నారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. కారణం.. ఆయన తనయుడి మీద  ఆరోపణలు రావడమే కారణం. ఈ ఆరోపణల్ని ఖండించడం కూడా చేయకుండా సైలెంటుగా ఉన్నారు. మీడియా వాళ్లకు ఆయన ఎక్కడా దొరకట్లేదు. మామూలుగా ఇండస్ట్రీ కార్యకలాపాల్ని పర్యవేక్షించే క్రమంలో ఆయన నిర్మాతల మండలిలో.. ఫిలిం ఛాంబర్లో తరచుగా సమావేశాల్లో పాల్గొంటుంటారు. కానీ ఇప్పుడాయన వాటన్నంటికీ దూరంగా ఉన్నారు. బయటికి వస్తే ఎక్కడ మీడియా వాళ్లు గొట్టం పెట్టి ఆ ఆరోపణలపై అడుగుతారో అని ఆయన భయపడుతున్నారు. ఈ వ్యవహారం సద్దుమణిగి అందరూ సైలెంటయ్యే వరకు ఇంటి పట్టునే ఉండాలని ఆయన డిసైడయ్యారట. ఐతే కాస్టింగ్ కౌచ్ వివాదం రోజు రోజూకూ పెద్దదవుతోంది తప్ప సద్దుమణగట్లేదు. ఈ నేపథ్యంలో ఆ అగ్ర నిర్మాత బయటికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో?