ఫోకస్: టాలీవుడ్ దండయాత్ర

Mon Jan 07 2019 07:00:01 GMT+0530 (IST)

ఇప్పటికి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇక మూడో ప్రపంచ యుద్ధం టాలీవుడ్ వల్లనే సాధ్యం. అమెరికాతో ఉత్తరమెరికా కాలు దువ్వాల్సిన పనేలేకుండా భారతదేశంలో ఒక కొత్త ఫీట్ సాధ్యం కాబోతోంది. అది కూడా టాలీవుడ్ వల్లనే.  కొత్త సంవత్సరంలో టాలీవుడ్ మరిన్ని కొత్త మైలురాళ్లను టచ్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోంది. రికార్డులు తిరగేస్తే.. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో 88ఏళ్లు టాలీవుడ్ హిస్టరీ ఉంది. ఇన్నేళ్లలో 100కోట్ల క్లబ్ అన్న మాటే వినడానికి దశాబ్ధాలు పట్టింది. ఇప్పుడు 100కోట్ల క్లబ్ కాదు.. తెలుగు సినిమా 500కోట్లు.. 1000కోట్లు.. దాటుకుని ఏకంగా 2000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఒకే ఒక్క బాహుబలి సిరీస్ సాధించిన అసాధారణ విజయం మన మేకర్స్ లో ఎంతో గొప్ప సృజనాత్మక మార్పు తెచ్చింది. పెట్టుబడుల పరంగా కథల ఎత్తుగడ పరంగా ప్రచారం లో ట్రేడ్ పరంగా ఆలోచించే విధానం మారింది. 2018లో ఆ దిశగా ఎన్నో అడుగులు పడ్డాయి. అటు భారతీయ సినిమా ముఖచిత్రాన్ని మార్చే బాలీవుడ్ ని వెనక్కి నెట్టేస్తూ దక్షిణాది సినిమా ఎదిగేస్తోంది. అందులో తెలుగు సినిమా ముందు ఇతర పరిశ్రమలన్నీ చిన్నబోతున్నాయంటే అతిశయోక్తి కాదు.కేవలం ఏదో ఒక ప్రాంతంలోనే మన సినిమాని రిలీజ్ చేస్తే సరిపోతుందనే పాత చింతకాయ మైండ్ సెట్ ఇప్పుడు ఎవరికీ లేనేలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో మన ఉత్పత్తిని ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అనే అగ్రరాజ్య ఎత్తుగడను మన తెలుగు సినిమా కూడా అందిపుచ్చుకుంటోంది. ట్రేడ్ పరంగా నభూతోనభవిష్యతి అన్న తీరుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంపై హాలీవుడ్ సినిమాతో పోటీపడుతూ టాలీవుడ్ దండయాత్రకు ఉపక్రమిస్తోంది.

కొత్త రెజియన్లలో కొత్త దేశాల్లో ప్రవేశిస్తున్న తెలుగు సినీపరిశ్రమ ఖ్యాతి అంతకంతకు విస్తరిస్తోంది. రెండేళ్ల క్రితం ఏవో కొన్ని కొత్త దేశాల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా రెండు డజన్ల దేశాల్లో రిలీజ్ చేసేస్తున్నారు మన సినిమాల్ని. తాజాగా జపాన్ మార్కెట్ చైనా మార్కెట్ మన తెలుగు సినిమాకి భారతీయ సినిమాకి ఆశావహంగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు అమెరికా ఇప్పుడు తెలుగు సినిమాకి మరో నైజాంగా మారిపోయింది. మునుముందు ఆ విస్త్రతి ఇంకా ఇంకా పెరగబోతోంది. అమెరికాలో భారీగా రిలీజైన తర్వాతనే హాలీవుడ్ సినిమాలు ఇతర దేశాల్లోనూ రిలీజవుతుంటాయి. సేమ్ సన్నివేశం మన తెలుగు సినిమాకి ఉందిప్పుడు. ఇక బ్రిటన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సింగపూర్ మలేషియా అబూదబీ ఇలా ప్రతిచోటా మన సినిమా ఆడుతోంది. డాలర్లు కురిపిస్తున్నాయి. అలాగే ....ఇటీవల జపాన్ లో బాహుబలి ఘనవిజయం నేపథ్యంలో ఆ దేశం బాక్సాఫీస్ కామధేనువుగా మారింది. సౌతాఫ్రికా కెనడా నెదర్లాండ్స్ నార్వే ఇంకా ఎన్నో చోట్ల మన సినిమాలు రిలీజవుతున్నాయి. మునుముందు కొరియా పాశ్చాత్య దేశాల్లోనూ టాలీవుడ్ ప్రభ విస్తరిస్తుందేమో చెప్పలేం. బాహుబలి 2.0 తర్వాత ఇంకా పెరుగుతున్న విస్త్రతి.. మార్కెట్ విలువ ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలీవుడ్ కి ధీటుగా... హాలీవుడ్ దిశగా పయనం... ఎన్నో ఆశల్ని రేకెత్తిస్తోంది.

ఇలా విస్త్రతి పెరుగుతూ పోతుంటే.. యూనివర్శల్ కాన్సెప్టులు ఉన్న స్క్రిప్టులకు విలువ పెరుగుతుంది.  రచయితల స్పాన్ పెరుగుతుంది.. సినిమా స్కోప్ రెట్టింపవుతుంది. ఆదాయాలు పెరుగుతాయి. ఆలోచనలు మారతాయి. జనాల జీవన శైలి మారుతుంది. ఇంకా ఎన్నో ఉత్పన్నాలు ఉంటాయి. ప్రస్తుతం సంక్రాంతి బరిలో వస్తున్న కథానాయకుడు వినయ విధేయ రామ చిత్రాలు వరల్డ్ వైడ్ అన్ని మూలలా అత్యంత భారీగా రిలీజవుతున్నాయి. ఇంతకుముందు వినిపించని కొత్త దేశాల పేర్లు టాలీవుడ్ ఖాతాలో వినిపిస్తున్నాయి. ఇదంతా బాగు బాగు అని సంతోషించాల్సిందే.