Begin typing your search above and press return to search.

వాట్ నెక్స్ట్..?

By:  Tupaki Desk   |   4 Oct 2015 10:30 PM GMT
వాట్ నెక్స్ట్..?
X
టాలీవుడ్ ప్రస్తుతం మంచి జోరు మీద వుంది. ఒక సినిమా అయ్యాక మరో సినిమా గురించి ఆలోచిద్దాం అనే పరిస్థితి నుండి మన దర్శకులు, హీరోలు బయటపడి ఒక సినిమా సెట్స్ పై ఉండగానే తర్వాతి సినిమాలకి శ్రీకారం చుట్టేస్తున్నారు. అతి కొద్దిమంది వాటిని ముందే ప్రకటిస్తుండగా, మిగిలినవారు క్లారిటీ ఇవ్వకుండా ఊరిస్తున్నారు. అలా 'వాట్ నెక్స్ట్..' అంటూ ప్రేక్షకులని టెన్షన్ పెడుతున్న టాలీవుడ్ హీరోల అప్ కమింగ్ సినిమాలపై ఓ ప్రత్యేక కథనం...

చిరంజీవి : ఎనిమిదేళ్లుగా తెరమీద కనపడని మెగాస్టార్ బ్రూస్ లీ సినిమాలో 150వ సినిమా టీజర్ ని చూపిస్తారని అంతా చెబుతున్నారు. ఎప్పట్నుండో ఊరిస్తున్న 150వ సినిమా మరో 10 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇది విడుదలయితేనే తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చేది.

బాలయ్య : నందమూరి నటసింహంగా అభిమానులచే పిలవబడే బాలకృష్ణ వందో సినిమా ముహూర్తం ఎప్పుడన్నదే వారి ప్రశ్న. ప్రస్తుతం డిక్టేటర్ సినిమా ఫుల్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య వందో సినిమాకి బోయపాటి పేరు వినిపిస్తుంది. బాలయ్యను ప్రేక్షకరంజకంగా చూపించడం బోయపాటికే సాధ్యమనేలా సింహ - లెజెండ్ సినిమాలు నిరూపించాయి. గనక బన్నీ సినిమా పూర్తయ్యాక బోయపాటి బాలయ్యతో చేయి కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

నాగార్జున : మనం సినిమా తర్వాత బాగానే గ్యాప్ తీసుకున్న నాగ్ ప్రస్తుతం సోగ్గాడిని థియేటర్ కి తీసుకొచ్చేందుకు ముస్తాబు చేస్తూనే కార్తి తో దిభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఊపిరి సినిమాలో నటిస్తున్నారు.

వెంకటేష్ : విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ తో సినిమాలు చేసేందుకు చంద్రశేఖర్ యేలేటి - క్రాంతి మాధవ్ - మారుతి లాంటి దర్శకులతో పాటు కొన్ని రీమేక్ కథలు సిద్ధంగా వున్నా వెంకీ నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన్ని తెరపై ఎప్పుడు చూసేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.

మహేష్ : ఒకప్పుడు మహేష్ సినిమా అంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ మధ్య సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సెట్స్ పై బిజీగా వున్నారు. తర్వాతి మహేష్ చేయబోయే దర్శకుల జాబితా చాలా పెద్దగానే వుంది. రాజమౌళి - త్రివిక్రమ్ - పూరి జగన్నాధ్ - మురుగదాస్ - వినాయక్ లాంటి అగ్ర దర్శకులంతా మహేష్ కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. సుకుమార్ కూడా మహేష్ తో హిట్ కొడతా అని ఆ మధ్య అన్నారు.

ప్రభాస్ : ప్రభాస్ రెండేళ్లని చెప్పి నాలుగేళ్ళు రాజమౌళి కాంపౌండ్ లోనే వుండిపోయాడు. ముందు చెప్పిన ప్రకారం అయితే బాహుబలి2 ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ ఇప్పటివరకూ అటువంటిదేమీ జరగలేదు. ఈ సినిమా వెండితెరపైకి వచ్చేది 2016 జూన్ నాటికే. అదే నిజమైతే ఓ రకంగా తొందరగా వచ్చినట్టే. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ ప్రభాస్ తో సినిమా చేస్తే గానీ వేరే సినిమా చేయనన్నట్టు పంతం పట్టినట్టున్నాడు. మరోవైపు ఇతర దర్శకులు కూడా బాహుబలిని తమ కథల్లో చూసేందుకు తహతహలాడుతున్నారు.

రామ్ చరణ్ : చరణ్ బ్రూస్ లీ గా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. తర్వాతి సినిమా కూడా బ్రూస్ లీ నిర్మాత దానయ్యతోనే అని తెలుస్తోంది. తమిళ చిత్రం తనీ ఒరువన్ రీమేక్ ని సురేందర్ రెడ్డి చేతిలో పెట్టారట సదరు నిర్మాత. చెర్రీతో సినిమా చేస్తానని సురేందర్ రెడ్డి అప్పట్లో చెప్పాడు. అది ఈ సినిమాతో నిజం కావచ్చు.

అల్లు అర్జున్ : వరుసగా 50 కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ త్వరలో గోన గన్నారెడ్డిగా పలకరించనున్నాడు. బోయపాటి సినిమా 40% షూటింగ్ అయిపోయిందట. తర్వాత బన్నీ కోసం పూరి జగన్నాధ్ తో పాటు ఇటీవల భలే భలే మగాడివోయ్ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన మారుతి కూడా కాచుకు కూర్చున్నాడు. మరికొంతమంది దర్శకులు బన్నీ కోసం క్యూలో వున్నారు.

పొతే... పవన్ సర్దార్ సెట్లో వున్నారు. ఆయన సినిమాలు ఎవరితో ఎప్పుడన్నది అధికారికంగా వచ్చేవరకు ఏమీ చెప్పలేం. పంజా దర్శకుడు లైన్లో వున్నట్టు అనుకుంటున్నారు. యువ హీరోలు కూడా సీనియర్ హీరోలకి ధీటుగా ఫుల్ బిజీగా వున్నారు. వీరందరిలో నారా రోహిత్ అరడజనుకుపైగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా వున్నాడు. సునీల్ కృష్ణాష్టమి మరో నెలలో దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటికొచ్చే అవకాశం వుంది. ప్రస్తుతం సునీల్ ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. నాని, నిఖిల్ ఇలా అందరూ వారి వారి కథల్ని లాక్ చేసి దాచేసుకున్నారు. అయితే వాటిలో ఏది ముందు కెమెరా ముందుకొచ్చేది కాలమే నిర్ణయిస్తుంది.