Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ టాప్ 10 రెమ్యున‌రేష‌న్స్

By:  Tupaki Desk   |   23 Sep 2019 1:30 AM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ టాప్ 10 రెమ్యున‌రేష‌న్స్
X
ఒక్కో సినిమాకి మ‌న స్టార్ హీరోల పారితోషికం ఎలా ఉంటుంది? అగ్ర‌ క‌థానాయిక‌ల పారితోషికాల రేంజ్ ఎలా ఉంటుంది? అంటే అది డిమాండును బ‌ట్టి.. స‌క్సెస్ రేటును బ‌ట్టి ఉంటుంద‌ని చెప్పొచ్చు. ఆల్రెడీ నిరూపించుకుని ద‌శాబ్ధంపైగా ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్న స్టార్ల రేంజు స్కైని ట‌చ్ చేస్తోంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఆర్టిస్టుల హ‌వా సాగినంత‌గా ఇంకెవ‌రిదీ సాగ‌ద‌నేందుకు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తున్న ఈ ఫిగ‌ర్స్ సాక్ష్యం. ఫిలింన‌గ‌ర్ గుస‌గుస ప్ర‌కారం తెలిసిన సంగ‌తులు ఇలా ఉన్నాయి.

ఇప్పుడున్న అగ్ర క‌థానాయ‌కుల పారితోషికాల రేంజ్ ప‌రిశీలిస్తే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఒక్కో సినిమాకి 25 కోట్ల రేంజు ఉండేది. కేవ‌లం ఈ రెండేళ్ల‌లోనే అత‌డి స్థాయి అమాంతం 50 కోట్లకు చేరింది. పారితోషికంతో పాటు ఏరియా హ‌క్కులు.. లాభాల్లో వాటాలు అంటూ ఓవ‌రాల్ గా అంత ముడుతుంద‌న్న స‌మాచారం ఉంది. మ‌హేష్ న‌టిస్తున్న 26వ సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి అన్నీ క‌లుపుకుని రూ.54కోట్ల పారితోషికం అందుకుంటున్నార‌ట‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రి రేంజు రూ.40 కోట్ల మార్క్ ని తాకింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ పాన్ ఇండియా సినిమా `ఆర్.ఆర్.ఆర్`లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఒక్కొక్క‌రు 40 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నారని ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డి.వి.వి.ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో ఆ మేర‌కు ఒప్పందం ఉంద‌ని చెబుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వ‌రుస‌గా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటిలో ఒక్కో సినిమాకి రూ.25కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ రేంజు అనూహ్యంగా చుక్క‌ల్ని తాకుతోంది. బాహుబ‌లి 1 - 2 చిత్రాల‌తో పాటు సాహో లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో అత‌డి స్థాయి చుక్క‌ల్ని తాకింది. సాహో చిత్రానికి యు.వి.క్రియేష‌న్స్ నుంచి 65కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

భారీ పాన్ ఇండియ‌న్ సినిమా `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిరు-రామ్ చ‌ర‌ణ్ ల సొంత ప్రొడ‌క్ష‌న్ కాబ‌ట్టి మెగాస్టార్ పారితోషికం డిమాండ్ చేయ‌లేద‌ట‌. ఇత‌ర‌ సీనియ‌ర్ హీరోల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక్కో సినిమాకి 8 కోట్ల మేర పారితోషికం అందుకుంటుండ‌గా.. కింగ్ నాగార్జున రూ.6కోట్లు .. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ 6 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నార‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తుండ‌గా.. ఫ్లాపుల వ‌ల్ల స్పీడ్ త‌గ్గింది. ర‌వితేజ‌కు ప్ర‌స్తుతం రూ.6కోట్లు మినిమం ముట్ట‌జెబుతున్నార‌ట‌.

ఆ త‌ర్వాత మిడ్ రేంజు హీరోలు అయిన నేచుర‌ల్ స్టార్ నాని.. రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ హ‌వా సాగుతోంది. నాని ఒక్కో సినిమాకి రూ.12కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటుండ‌గా.. క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 కోట్ల రేంజులో పారితోషికం పుచ్చుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వైవిధ్య‌మైన సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ కి ఒక్కో సినిమాకి రూ.4కోట్ల రేంజు ప‌లుకుతోంద‌ట‌. అలాగే ఫిదా-తొలి ప్రేమ‌-ఎఫ్ 2 లాంటి చిత్రాల‌తో స‌క్సెస్ ల ప‌రంగా జోరుమీదున్న వ‌రుణ్ తేజ్ తాజాగా `వాల్మీకి` తో మ‌రో హిట్టు కొట్టాడ‌న్న టాక్ వినిపిస్తోంది. అత‌డి పారితోషికం రేంజు రూ.5కోట్లు ఉంద‌ని తెలుస్తోంది. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన రామ్ స‌రైన హిట్టు కోసం వేచి చూస్తున్న టైమ్ లో `ఇస్మార్ట్ శంక‌ర్` రూపంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఎడారిలో ఒయాసిస్ లా ఆదుకుంది ఈ చిత్రం. ఎన‌ర్జిటిక్ హీరోగా తొలి నుంచి యువ‌త‌రంలో ఫాలోయింగ్ ఉన్న రామ్ కి రూ.4కోట్ల రేంజు పారితోషికం ముడుతోంద‌ట‌.

క‌థ‌నాయిక‌ల పారితోషికాల రేంజు ప‌రిశీలిస్తే.. సౌత్ లో ద‌శాబ్ధంన్న‌ర కాలంగా ఎదురేలేని భామ‌గా న‌య‌న‌తార స్పీడు కొన‌సాగుతోంది. అగ్ర హీరోలంద‌రికీ న‌య‌న్ ఒక ఆప్ష‌న్ గా మార‌డంతో అడిగినంతా ఇచ్చి ఒక్కోసారి బ‌తిమాలుకుని కూడా పారితోషికాలు అందిస్తున్నారు మ‌న నిర్మాత‌లు. సైరా-న‌ర‌సింహారెడ్డి స‌హా బాల‌కృష్ణ‌.. ర‌జ‌నీకాంత్.. అజిత్.. విజ‌య్ లాంటి టాప్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది న‌య‌న్. సైరా చిత్రానికి 6కోట్ల పారితోషికం అందుకుంటోంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ముంబై భామ‌ల హ‌వా తగ్గిన ఈ టైమ్ లోనూ హాట్ గాళ్ పూజా హెగ్డే ఒక్కో చిత్రానికి రూ.2కోట్లు వెన‌కేసుకుంటోంద‌ట‌. వ‌రుస‌గా స్టార్ హీరోల‌కే క‌మిట‌వుతున్న మ‌రో ముంబై ర్యాంప్ క్వీన్ కియ‌రా అద్వానీ ఒక్కో క‌మిట్ మెంట్ కి రూ.3కోట్లు ఖాతాలో వేసుకుంటోంద‌ట‌.

అందాల ర‌కుల్ ప్రీత్ కి కొన్ని వ‌రుస ఫ్లాపులు ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో కోటి నుంచి 50ల‌క్ష‌ల రేంజుకు పారితోషికం ప‌డిపోయింద‌ని చెప్పుకుంటున్నారు. సోలో నాయిక‌గా సినిమాని భుజ‌స్కంధాల‌పై మోస్తున్న స‌మంత‌కు ఒక్కో సినిమాకి 1.5కోట్ల మేర పారితోషికం అందుతోంద‌ని స‌మాచారం. మ‌జిలీ- ఓ బేబి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ల జాబితాలో చేర‌డంతో గ్రాఫ్ పెరిగింద‌ని చెబుతున్నారు. సామ్ పారితోషికం రేంజు మ‌రింత పెంచే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదంతా ఫిలింన‌గ‌ర్ గాసిప్ రాయుళ్ల గుస‌గుస‌ల్లో రెగ్యుల‌ర్ గా వినిపించే సంగ‌తులు. పారితోషికాల గురించి అధికారికంగా ఎవ‌రూ చెప్ప‌రు కాబ‌ట్టి.. మేనేజ‌ర్లు లీకుల్లోంచి తెలిసిన ఆస‌క్తిక‌ర సంగుతులు ఇవి.