Begin typing your search above and press return to search.

మన హీరోలందరూ డిజాస్టర్ స్టార్లే బాబూ..

By:  Tupaki Desk   |   31 May 2016 9:29 AM GMT
మన హీరోలందరూ డిజాస్టర్ స్టార్లే బాబూ..
X
మహేష్ బాబు డిజాస్టర్ స్టార్ అట.. ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్‌ కా బాప్ అట.. కొన్ని రోజులుగా యాంటీ ఫ్యాన్సీ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలివి. ఐతే డిజాస్టర్లు మహేష్‌ కు మాత్రమే ఉన్నాయా.. మిగతా హీరోలందూ బ్లాక్ బస్టర్ స్టార్లేనా? ఓసారి మన స్టార్ హీరోల డిజాస్టర్ హిస్టరీ ఓసారి తిరగేద్దాం పదండి.

ప్రస్తుతం ‘డిజాస్టర్ స్టార్’గా యాంటీ ఫ్యాన్స్ స్టాంప్ వేసేసిన మహేష్ నుంచే మొదలుపెడదాం. బాల నటుడిగా చేసిన సినిమాల్ని పక్కనబెట్టేస్తే.. హీరో అయ్యాక మహేష్ 22 సినిమాలు చేశాడు. అందులో డిజాస్టర్లు కాస్త ఎక్కువే ఉన్నాయిలెండి. ప్రిన్స్ కెరీర్లో తొలి డిజాస్టర్ ‘వంశీ’ రూపంలో వచ్చింది. ఆ తర్వాత ‘బాబీ’ అతణ్ని దారుణమైన దెబ్బ కొట్టింది. ‘బ్రహ్మోత్సవం’ ముందు వరకు మహేష్ కెరీర్లో ఇదే అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. ఇక ‘ఒక్కడు’ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడితోనే ‘సైనికుడు’ లాంటి డిజాస్టర్ అందుకున్నాడు మహేష్. దాని కంటే ముందు ‘నాని’ రూపంలో మరో డిజాస్టర్ కూడా ఉంది ప్రిన్స్ కెరీర్లో. ఆపై ‘ఖలేజా’ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇక రెండేళ్ల కిందట వరుసగా ‘1 నేనొక్కడినే’.. ‘ఆగడు’ డిజాస్టర్లుగా మిగిలాయి. లేటెస్టుగా ‘బ్రహ్మోత్సవం’ రూపంలో మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల నష్టంతో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక లాస్ మిగిల్చిన సినిమా రికార్డు సృష్టించబోతోందని అంటున్నారు. మహేష్ కెరీర్లో టక్కరిదొంగ, నిజం, అతిథి కూడా పెద్ద ఫ్లాపులే కానీ.. వాటిని డిజాస్టర్ల జాబితాలో వేయలేం.

మహేష్ బాబుని ప్రధానంగా టార్గెట్ చేసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు తమ హీరో డిజాస్టర్లను కూడా గుర్తు చేయాల్సిందే. పవన్ కూడా మహేష్ తో సమానంగా 22 సినిమాలు చేయగా.. అందులో డిజాస్టర్ల లిస్టు తీస్తే ముందు చెప్పాల్సింది పవన్ స్వయంగా దర్శకత్వం వహించిన ‘జానీ’ గురించి. టాలీవుడ్ అప్పట్లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్. దారుణమైన నష్టాల్ని మిగిల్చింది. తర్వాత చెప్పుకోవాల్సింది ‘పులి’ గురించి. ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎస్.జె.సూర్య.. పవన్‌ తో రెండోసారి జతకట్టి ఆ కళాఖండాన్ని అందించాడు. ఇంకో ఇద్దరు తమిళ దర్శకులు పవన్‌కు డిజాస్టర్లు కట్టబెట్టారు. ధరణి దర్శకత్వంలో వచ్చిన ‘బంగారం’.. విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన ‘పంజా’ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంకా ‘గుడుంబా శంకర్’.. ‘బాలు’ సినిమాల్ని కూడా డిజాస్టర్ల జాబితాలో వేయొచ్చు. లేటెస్టుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో తన సినిమాల నష్టాల రికార్డులన్నీ చెరిపేశాడు పవన్.

ఇక మహేష్ - పవన్‌ ల కంటే లేటుగా సినిమాల్లోకి వచ్చినా.. అప్పుడే 25 సినిమాలు పూర్తి చేసేసిన జూనియర్ ఎన్టీఆర్‌ కెరీర్లో కూడా కావాల్సినన్ని డిజాస్టర్లున్నాయి. స్టార్ ఇమేజ్ సంపాదించాక ‘ఆంధ్రావాలా’ అతడికి తగిలిన అతి పెద్ద షాక్. ఆపై ‘నా అల్లుడు’ - ‘నరసింహుడు’ - ‘శక్తి’ - ‘రామయ్యా వస్తావయ్యా’ - ‘రభస’ లాంటి డిజాస్టర్లు వచ్చాయి ఎన్టీఆర్ నుంచి. ఫ్లాపుల లెక్క తీస్తే జాబితా పెద్దదవుతుంది కానీ.. నిఖార్సయిన డిజాస్టర్లుగా వీటినే చెప్పాలి. ఇక 9 సినిమాలు చేసిన రామ్ చరణ్ కెరీర్లో మూడు డిజాస్టర్లున్నాయి. ఐతే ఆ మూడూ దేనికి ఏదీ తీసిపోదు. ‘ఆరెంజ్’ రూపంలో తొలి మెగా ఎదుర్కొన్న చరణ్.. ఆ తర్వాత వరుసగా సేఫ్ సినిమాలు చేసుకుంటూ పోయాడు కానీ.. మధ్యలో బాలీవుడ్ వెళ్లి జంజీర్ (తెలుగులో తుఫాన్) చేసి ఎప్పటికీ మరిచిపోలేని చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. ఇక లేటెస్టుగా ‘బ్రూస్ లీ’తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో కూడాడిజాస్టర్లున్నాయి. చక్రం.. పౌర్ణమి.. యోగి..రెబ‌ల్‌..అడవి రాముడు ... రాఘవేంద్ర సినిమాలు అతడికి చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ప్రభాస్ ఇప్పటిదాకా 17 సినిమాలు చేశాడు. ఇక ప్రస్తుత స్టార్ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్.. అతి తక్కువ డిజాస్టర్లున్న హీరోగా అల్లు అర్జున్ పేరే చెప్పాలి. అతడి కెరీర్లో రెండు డిజాస్టర్లున్నాయి. ఒకటి బద్రీనాథ్ అయితే.. ఇంకోటి వరుడు... హ్యాపీ - ఇద్దరమ్మాయిలతో - పరుగు .. ఆర్య 2 లాంటి ఫ్లాపులున్నాయి కానీ.. వాటిని డిజాస్టర్ల జాబితాలో వేయలేం. బన్నీ ఇప్పటిదాకా 16 సినిమాలు చేశాడు.