వైట్ అండ్ వైట్ కామెడీ బ్యాచ్

Sun Jan 21 2018 13:33:20 GMT+0530 (IST)

ఎంత సినిమా తారలైనా వాళ్లకూ కొన్ని సరదాలు ఉంటాయి. కాకపోతే మనలాగా బయట కలిసి చేసుకునే అవకాశం ఉండదు కాని ఛాన్స్ దొరికినప్పుడు అందరూ కలుసుకుని చేసే రచ్చ మామూలుగా ఉండదు. దీనికి హీరో హీరొయిన్ కమెడియన్ అంటూ భేదం ఉండదు. ఎవరెలా ఉన్నా హాస్య నటులకు ఉండే ప్రత్యేకత గుర్తింపు వేరు. హీరోలు మహా అయితే యాభై నుంచి ఓ రెండు మూడు వందల్లో సినిమాలు చేసుకోగలరేమో కాని కమెడియన్లకు మాత్రం అలాంటి లిమిట్స్ ఏమి ఉండవు. అందుకే బ్రహ్మానందం లాంటి వారు వెయ్యి సినిమాలు సునాయాసంగా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు తరం మారింది. యువత వచ్చేసింది. తమకు మాత్రమే ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు.యంగ్ జనరేషన్ కమెడియన్స్ అందరూ నిన్న ఒక చోటా చేరి సాంప్రదాయబద్ధమైన తెల్లని పంచె - చొక్కా ధరించి మస్త్ అనిపించేలా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు. వెన్నెల కిషోర్ తన ట్విట్టర్ లో దీన్ని షేర్ చేసుకుంటూ తాము నెలకు ఒకసారి చేసుకునే లీగ్ పార్టీలో ఈ సారి థీమ్ ఏం సెలెక్ట్ చేసుకున్నామో చూడండి అంటూ ఫాన్స్ తో తన అందాన్ని పంచుకున్నాడు. శ్రీనివాస రెడ్డి - సత్యం రాజేష్ - వెన్నెల కిషోర్ - ధన రాజ్ - నందు - తాగుబోతు రమేష్ లతో పాటు ఈ మధ్య వస్తున్న సినిమాల్లో తమ సత్తా చాటుతున్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. మధ్యలో నందు ఉన్నాడు కాబట్టి ఇదేమైనా అతను నటించిన సినిమా సెట్ లో చేసుకున్నారా లేక ప్లాన్ చేసి అంతా ఒక చోట డ్రెస్ కోడ్ తో కలుసుకున్నారా అనేది వెన్నెల కిషోర్ చెప్పలేదు. అందరూ వరసగా నిలబడి నవ్వులు చిందిస్తూ అచ్చ తెలుగు పంచకట్టు ఉన్న ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.