Begin typing your search above and press return to search.

డ్రగ్స్ తారలకు బయటపడ్డం తేలికే!?

By:  Tupaki Desk   |   23 July 2017 5:08 AM GMT
డ్రగ్స్ తారలకు బయటపడ్డం తేలికే!?
X
టాలీవుడ్ ని డ్రగ్స్ స్కాండల్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తో ప్రారంభించి.. శ్యామ్ కె నాయుడు.. సుబ్బరాజు.. నిన్న తరుణ్.. ఇలా ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు. మొత్తం 12 మందికి సంబంధించి.. ఎప్పుడెప్పుడు విచారణకు రావాలనే షెడ్యూల్ ఉంది. వీరు చెబుతున్న ప్రకారం ఇప్పుడు బయటకు వస్తున్న ఇతరులకు కూడా త్వరలో నోటీసులు జారీ చేసి.. వారిని కూడా విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే.. ఈ కేసులో సెలబ్రిటీల పరిస్థితి ఏంటి.. వారు అరెస్టు అవుతారా.. జైలు పాలవుతారా వంటి అనేక ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. కానీ న్యాయ నిపుణులు చెబుతున్న ప్రకారం చూస్తే.. డ్రగ్స్ కేసు నుంచి తారలు అంతగా త్వరగానే బయటపడచ్చని అంటున్నారు. ఇందుకు తగిన చట్టాలను కూడా కోట్ చేస్తున్నారు. ఓ డ్రగ్ పెడ్లర్ చేసిన ఆరోపణలు.. అతని ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ మినహాయిస్తే.. ఈ కేసులో సెలబ్రిటీలపై పెద్దగా ఆధారాలు ఏమీ లేవనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ముందుగా తగిన విధంగా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే.. పోలీసులు విచారణ చేస్తున్నారని.. అదే ఇప్పుడు సెలబ్రిటీలకు వరంగా మారనుందని వారి వాదన.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టెన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం.. భారీ మొత్తంలో డ్రగ్స్ తో పట్టుపడిన పెడ్లర్స్ కు మాత్రమే నాన్ బెయిలబుల్ కేసుల కింద బుక్ చేసే అవకాశం ఉంటుంది. చిన్న క్వాంటిటీ డ్రగ్స్ తో పట్టుబడ్డవారికి బెయిల్ రావడం సులభమే. మంచి లాయర్ ను ఏర్పాటు చేసుకుంటే రోజుల వ్యవధిలోనే జైల్ నుంచి బయటకు రావచ్చట. ఈ చట్టం ప్రకారం డ్రగ్స్ దొరికే వరకూ వారిని ప్రాసిక్యూట్ చేయడం చాలా కష్టమే అంటున్నారు. మొదటగా పట్టుబడ్డ కెల్విన్ విషయంలో కూడా భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికక ముందే అరెస్ట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. చిన్న మొత్తంలో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు వచ్చినవారికి.. వారి కోరిక మేరకు డీ అడిక్షన్ కు ఏర్పాట్లు జరుగుతాయి.