Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘టిక్ టిక్ టిక్’

By:  Tupaki Desk   |   23 Jun 2018 8:17 AM GMT
మూవీ రివ్యూ: ‘టిక్ టిక్ టిక్’
X
‘టిక్ టిక్ టిక్’

నటీనటులు: జయం రవి- నివేథా పెతురాజ్-జయప్రకాష్-రమేష్ తిలక్-అర్జునన్-విన్సెంట్ అశోకన్ తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: వెంకటేష్
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్

ఇండియాలో తెరకెక్కిన తొలి స్పేస్ ఫిలింగా ‘టిక్ టిక్ టిక్’ కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోంది. తమిళంలో జయం రవి కథానాయకుడిగా శక్తి సౌందర్ రాజన్ రూపొందించిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమై ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రోమోలతో ఆకర్షించిన ‘టిక్ టిక్ టిక్’ సినిమాగా ఏమేరకు మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

అంతరిక్షం నుంచి ఒక ఆస్టరాయిడ్ కొన్ని రోజుల్లోపు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలపై పడి నాలుగు కోట్ల మంది నామరూపాల్లేకుండా పోతారన్న సమచారం అందుతుంది శాస్త్రవేత్తలకు. దాన్ని అత్యవసరంగా అడ్డుకోవడానికి ఒకే ఒక మార్గం కనిపిస్తుంది. అంతరిక్షంలో చైనా దగ్గరున్న మిసైల్‌ ను దొంగిలించి ఆ ఆస్టరాయడ్ మీదికి ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ పని చేయడం కోసం వాసు (జయం రవి) అనే ప్రమాదకర దొంగ సాయం తీసుకోవాలని అధికారులు నిర్ణయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కూడా సంపాదిస్తారు. వాసు తన టీంతో కలిసి ఈ మిషన్ కు సిద్ధమవుతాడు. ఇటు వ్యోమగాములు.. వాసు.. అతడి మిత్రులు కలిసి అంతరిక్ష పర్యటనకు బయల్దేరతారు. మరి అక్కడ వీళ్లకు ఎలాంటి పరిస్థితులు.. సవాళ్లు ఎదురయ్యాయి.. తనకు అప్పగించిన మిషన్ వాసు పూర్తి చేశాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరో అతడి టీం శత్రు దేశానికి చెందిన ఉపగ్రహంలోకి అడుగుపెడతారు. శత్రువులకు బందీలుగా చిక్కుతారు. హీరో స్వతహాగా వ్యోమగామి కూడా కాదు. అవతల చూస్తే ఆ ఉపగ్రహాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న తలపండిన నిపుణుడుంటాడు. అతడి కోసం పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటారు. అందులో చీమ చిటుక్కుమన్నా అతడికి తెలిసిపోతుంది. హీరో అక్కడ అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టం. అయితేనేం.. అక్కడ ఒక మాస్ హీరోలాగే ఎన్నో సాహసాలు చేసేస్తాడు. ఎదురొచ్చిన వాళ్లందరినీ మట్టుబెట్టేస్తాడు. ఆ ఉపగ్రహం నుంచి ప్రమాదకర మిస్సైల్‌ ని పట్టుకొచ్చేస్తాడు. అది చెయ్యి జారి భూమి మీదికి పడబోతుంటే ఆపేస్తాడు. ఇంకా చంద్రమండలంపైన మరెన్నో విన్యాసాలు చేస్తాడు. ఇవన్నీ మాస్ ప్రేక్షకులకు కావాల్సినంత మజానిస్తాయి. విజిల్స్ కొట్టిస్తాయి. కానీ ఇవన్నీ ఎలాంటి జానర్ సినిమాలో చేస్తున్నారో తలుచుకుంటే మాత్రం నవ్వొస్తుంది.

ప్రపంచ స్థాయిలో ఎన్నో స్పేస్ సినిమాలు వచ్చాయి. వాటిని చూసిన కళ్లతో తొలి భారతీయ స్పేస్ మూవీని ఎలా డీల్ చేశారో.. ఇందులో కొత్తగా ఏం చూపించారో.. ఎలాంటి విజ్ఞానం పంచుతారో.. ఎంత ఉన్నతంగా దీన్ని తీర్చిదిద్దారో అని ఆసక్తిగా చూసే వాళ్లకు చాలా వరకు నిరాశ తప్పదు. ఇది కచ్చితంగా ఒక మంచి ప్రయత్నమే. పరిమిత బడ్జెట్లో గొప్ప సాహసమే చేసింది చిత్ర బృందం. వాళ్ల కష్టమంతా తెరపై కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్.. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా చేశారు. నిజంగా స్పేస్ లోనే ఉన్న భావన కలిగిస్తూ.. ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో యాంబియెన్స్ సహజంగా ఉండేలా చూసుకున్నారు. సినిమా అంతటా ఒక భారీతనం చూపించారు. కానీ సాంకేతికాంశాల్లో చూపించిన ప్రమాణాల్ని కథను నడిపించడంలో చూపించలేదు. నేపథ్యం కొత్తగా.. కాన్సెప్ట్ కూడా భిన్నంగా అనిపించినప్పటికీ వాస్తవికతకు దూరంగా సాగే కథనం.. అసలు కథను పలుచన చేసేసే కమర్షియల్ హంగుల కారణంగా ‘టిక్ టిక్ టిక్’ చివరికి ఒక సాధారణ సినిమాలాగానే అనిపిస్తుంది.

‘టిక్ టిక్ టిక్’లో వినోదానికి ఢోకా లేదు ఇందులో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఎస్కేప్ ఆర్టిస్ట్ కమ్ మెజీషియన్ గా హీరో పాత్ర పరిచయ సన్నివేశాలు కావచ్చు.. అంతరిక్షంలో అతను తన నైపుణ్యాల్ని ప్రదర్శిస్తూ శత్రువుల్ని దెబ్బ తీసి మిస్సైల్ దొంగిలించే ఎపిసోడ్ కావచ్చు.. హీరోయిజం కోరుకునే ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహం తీసుకొస్తాయి. ఆయా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం సైతం మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా సాగుతుంది. హీరోయిజం మాత్రమే కాదు.. ఇందులో సెంటిమెంటుకి.. కామెడీకి కూడా ఢోకా లేదు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే సన్నివేశాలు అక్కడక్కడా కదిలిస్తాయి. అలాగే 4 కోట్ల మందిని కాపాడే మిషన్లో వ్యోమగాముల బృందంలో ఉంటూ ఇద్దరు కమెడియన్లతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఇలా స్పేస్ ఫిలింలో కూడా ఇలాంటి మసాలాలు అద్దినందుకు దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ను పొగడాలో తిట్టాలో అర్థం కాదు. కాకపోతే హీరో హీరోయిన్ల మధ్య ఫోర్స్డ్ రొమాన్స్ కోసం ప్రయత్నించకుండా అక్కడొక చోట రాజీ పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇండియాస్ ఫస్ట్ స్పేస్ ఫిలింగా ‘టిక్ టిక్ టిక్’ గురించి గొప్పగా ప్రచారం సాగిన నేపథ్యంలో ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాను ఇండియన్ స్క్రీన్ మీద చూద్దామని ఆశించిన వాళ్లకు మాత్రం నిరాశ తప్పదు. కొంత వరకు స్పేస్ సబ్జెక్టుని సరళంగా చెప్పే ప్రయత్నం జరిగింది. కొన్ని సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఉన్న పరిమితుల్లోనే అంతరిక్ష సన్నివేశాల్ని బాగా తెరకెక్కించడం.. గందరగోళం లేకుండా చూడటంలో చిత్ర బృందం విజయవంతమైంది. కానీ హాలీవుడ్ స్పేస్ సినిమాల స్థాయిలో కథను వాస్తవికంగా.. ఉన్నతంగా చెప్పడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. లాజిక్కుల గురించి పట్టించుకోకుండా.. హాలీవుడ్ సినిమాలతో పోల్చుకోకుండా.. కమర్షియల్ హంగులద్దిన ఒక స్పేస్ ఫిలింతో టైంపాస్ చేయాలనుకుంటే మాత్రం ‘టిక్ టిక్ టిక్’ మంచి ఆప్షనే. అంతకుమించి ఇందులో గొప్పదనం అంటూ ఏమీ లేదు.

నటీనటులు:

జయం రవి మంచి పెర్ఫామర్ అని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఇంటెన్స్ నటనతో అతను ఆకట్టుకున్నాడు. అతడి కళ్లలో ఒక తీవ్రత కనిపిస్తుంది. మాస్ ప్రేక్షకుల్ని అతడి పాత్ర అలరిస్తుంది. హీరోయిన్ నివేథా ఆకట్టుకుంటుంది. ఆమె అందం, అభినయం రెండూ మెప్పిస్తాయి. కాకపోతే ఆమెను గ్లామరస్ గా చూడాలనుకునేవాళ్లకు నిరాశే. హీరో హీరోయిన్ల మధ్య అలాంటి కెమిస్ట్రీ కూడా ఏమీ వర్కవుట్ కాలేదు. విలన్ పాత్రలో జయప్రకాష్ ఓకే. రమేష్ తిలక్.. అర్జునన్ బాగానే నవ్వించారు. మిగతా నటీనటులందరూ బాగానే చేశారు.

సాంకేతికవర్గం:

‘టిక్ టిక్ టిక్’లో సాంకేతిక నిపుణుల పనితీరు కీలకం. డి.ఇమాన్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు పెద్ద బలంగా నిలిచాడు. పాటలు పర్వాలేదు. వెంకటేష్ ఛాయాగ్రహణం బాగుంది. ఆర్ట్ వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జరిగిన కృషికి అభినందనలు చెప్పాల్సిందే. ఇలాంటి సాహసోపేత సినిమా కోసం ముందుకు వచ్చిన నిర్మాతల్ని కూడా కొనియాడాలి. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్.. ఈ జానర్లో సినిమా తీయాలనుకోవడం గొప్ప విషయమే. కాకపోతే అతను కొత్తగా ఏమీ చేసింది లేదు. హాలీవుడ్లో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘ఆర్మగెడన్’తో పాటు పలు స్పేస్ సినిమాల స్ఫూర్తితో కథ రాసుకున్న అతను రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే అంశాలతోనే సినిమాను తీర్చిదిద్దాడు. సగటు ప్రేక్షకుల్ని మెప్పించేలా.. పెద్దగా బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించడంలో విజయవంతమయ్యాడు కానీ.. ఈ జానర్ సినిమాలకు అలవాటు పడ్డ వాళ్లను మాత్రం అతను మెప్పించలేకపోయాడు.

చివరగా: టిక్ టిక్ టిక్.. అంతరిక్షంలో అరవ మసాలా

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre