Begin typing your search above and press return to search.

విలక్షణ నటుడికి టైట్ సెక్యూరిటీ

By:  Tupaki Desk   |   18 April 2019 7:55 AM GMT
విలక్షణ నటుడికి టైట్ సెక్యూరిటీ
X
అనుకుంటాం కానీ అభిమానం కేవలం మాస్ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్లకే కాదు నటనతో ఆకట్టుకునే ఎవరికైనా దక్కుతుందని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ రుజువు చేస్తున్నాడు.తీవ్రమైన వ్యాధితో ఏడాదిపాటు విదేశాల్లో చికిత్స తీసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ రాగానే అంగ్రేజీ మీడియం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అందులో పెద్దగా విశేషం లేదు కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.

ఈ సినిమా షూట్ జరుపుతున్న ఉదయ్ పూర్ పరిసర ప్రాంతాల్లో ఇర్ఫాన్ ఖాన్ ను చూడటం కోసం వస్తున్న ఫ్యాన్స్ తో సెక్యూరిటీ పెద్ద సమస్యగా మారిందట. మామూలుగానే ఉదయ్ పూర్ టూరిస్ట్ స్పాట్. అలాంటిది ఇలా తారలు ఉన్నారంటే ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. దాంతో యూనిట్ అలెర్ట్ అయిపోయి అంగ్రేజీ మీడియం సెట్ చుట్టూ సెక్యూరిటీని టైట్ చేసేసింది.

ఒక్క ఇర్ఫాన్ కోసమే ఏకంగా 18 మంది సిబ్బందిని నియమించింది. మామూలుగా ఏ సల్మాన్ ఖానో షారుఖ్ ఖానో అయితే తప్ప ఇందరేసి సెక్యూరిటీ గార్డులు ఉండరు. కానీ అంత పెద్ద హీరోలతో సమానంగా ఇర్ఫాన్ ఖాన్ సంపాదించుకున్న అభిమానం చూసి సెలెబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

హిందీ మీడియం కు సీక్వెల్ గా రూపొందుతున్న అంగ్రేజీ మీడియం ఇర్ఫాన్ ఖాన్ కు కం బ్యాక్ మూవీ. చైనా లాంటి దేశాల్లో సైతం మిలియన్ల వసూళ్లు దక్కించుకున్న మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా అంగ్రేజీ మీడియం రూపొందిస్తున్నట్టు టాక్. హోమి అడజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కరీనా కపూర్ కీలక పాత్ర చేస్తోంది