బాలీవుడ్ కుర్రాళ్లలో టైగరే టాప్

Thu May 17 2018 10:40:15 GMT+0530 (IST)

బాలీవుడ్ లో బోలెడంత మంది హీరోలు ఉన్నారు. కానీ మిస్టర్ డిపెండబుల్ అనే పాయింట్ కి వస్తే మాత్రం.. అతి తక్కువ పేర్లు కనిపిస్తాయి. ఖాన్ హీరోలు ముగ్గురూ టాప్ స్టార్లుగా ఎదిగాక.. ఇతరులు ఆస్థాయికి చేరుకోలేకపోయిన మాట వాస్తవమే. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకున్నారు వీరు.వీరి తర్వాత అక్షయ్ కుమార్ నిలుస్తాడు. మొదట్లో యాక్షన్ కంటెంట్.. ఇప్పుడు విభిన్నమైన కథలు.. రియల్ లైఫ్ స్టోరీలతో మెప్పిస్తున్నాడు బాలీవుడ్ ఖిలాడీ. ఇక ఒక్క సినిమా కహో నా ప్యార్ హై అంటూ ఓవర్ నైట్ సెన్సేషన్ సృష్టించి స్టార్ అయిపోయిన హృతిక్ రోషన్.. ఇఫ్పటికీ హవా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ తర్వాత స్థానం ఎవరిది అంటే మాత్రం.. ఇప్పటివరకూ అనేక పేర్లు వినిపించేవి. ఇప్పుడు అవన్నీ కొట్టేసి.. టైగర్ ష్రాఫ్ పేరు రాసేసుకోవచ్చు. ఇతడికి దరిదాపుల్లో కూడా వేరే ఏ ఇతర హీరో కనిపించడం లేదని.. ముఖ్యంగా కుర్రాళ్లలో ఇతడే టాప్ అని ట్రేడ్ జనాలు అంటున్నారు.

ఇందుకు కారణం.. టైగర్ సినిమా రిలీజ్ ఉన్నపుడల్లా.. మాస్ సెంటర్లు కళకళలాడిపోతున్నాయి. జనాల్లో హిస్టీరియా మాదిరిగా.. ఇతడి సినిమా చూడాలన్న ఆతృత కనిపిస్తోంది. ఇదే విషయం.. కలెక్షన్స్ పరంగా కూడా ప్రూవ్ అవుతోంది. రీసెంట్ గా టాలీవుడ్ క్షణంను కిచిడీ చేసేసి మరీ యాక్షన్ ఫిలింగా మార్చి బాఘీ2 అంటూ తెరకెక్కించగా.. ఈ సినిమాకు 165 కోట్ల వసూళ్లు రావడం.. ట్రేడ్ జనాలను కూడా విస్మయపరిచింది. కేవలం ఐదు సినిమాలే చేసినా.. రేటింగులతో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబడుతున్నాడు టైగర్ ష్రాఫ్.

అరివీర భయంకరమైన యాక్షన్ కంటెంట్.. ఫ్లోర్ బద్దలయిపోద్దేమో అనిపించే డ్యాన్స్ మూమెంట్స్.. ఎక్కడ ఎన్ని పలకలు ఉన్నాయో లెక్కెట్టేందుకూడా కష్టం అనిపించే బాడీ.. ఇలా ఇతర హీరోలకు విభిన్నమైన రూట్ లో వెళుతున్న టైగర్ ష్రాఫ్.. ఇప్పుడు మిస్టర్ డిపెండబుల్ హీరో అని.. నెక్ట్స్ జనరేషన్ స్టార్ అని బాలీవుడ్ విపరీతంగా నమ్ముతోంది.