గండంలా మారుతున్న గురువారం

Tue Sep 18 2018 21:51:37 GMT+0530 (IST)

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ కి కొదవ లేదు. సినిమా సక్సెస్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుందన్న మాట నిజమే అయినా ఏ మేకర్ వీటికి అతీతంగా ప్రవర్తించడు. దర్శకుడు లేదా నిర్మాత లేదా హీరోకో ఎవరో ఒకరికి ఈ పట్టింపులు ఉండనే ఉంటాయి. కొన్నిసార్లు ఫలితాలను విశ్లేషించినప్పుడు ఆశ్చర్యం గొలిపే రీతిలో కొన్ని సంగతులు తెలిసినప్పుడు అవును నిజమే కదా అనిపిస్తుంది. అలాంటిదే 2018 గురువారం గండం కనిపిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా పూర్తి సమాచారం చూసాక మీరే ఒప్పుకుంటారు.సాధారణంగా సినిమాల విడుదలకు అనుకూలంగా శుక్రవారాన్ని ఎంచుకోవడం ఆనవాయితీ. దానికి కారణం వీక్ ఎండ్ కు ముందు వచ్చే రోజుతో పాటు మొత్తం వారంలో శుభప్రదమైన రోజు కాబట్టి. కానీ మారిన పరిస్థితులు పెరిగిన పోటీ నేపధ్యంలో అన్ని సినిమాలు శుక్రవారమే రావాలంటే కుదరడం లేదు. దానికి తోడు ఏవైనా పెద్ద పండగలు వచ్చినప్పుడు ఆ అడ్వాంటేజ్ ను తీసుకోవడం కోసం గురువారం విడుదల చేస్తున్న సినిమాలు లేకపోలేదు. కానీ ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా గురువారం విడుదలైన సినిమాల్లో ఒక్కటీ యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకున్నది లేకపోవడం అసలు ట్విస్ట్. అదేంటో మీరే చూడండి.

2018లో ఇప్పటి దాకా గురువారం విడుదలైన సినిమాలు మొత్తం 11. ఫిబ్రవరి 10న విడుదలైన నితిన్ చల్ మోహనరంగాకు పవన్-త్రివిక్రమ్ అండ ఉన్నా యావరేజ్ కు అడుగు దూరంలో ఆగిపోయింది. ఏప్రిల్ 12న వచ్చిన నాని కృష్ణార్జున యుద్ధం అతని జైత్ర యాత్రకు పెద్ద బ్రేక్ వేసింది. జూన్ 7న వచ్చిన రజని కాలా మరో డిజాస్టర్ గా మిగిలింది. కాస్త కొత్తగా ట్రై చేద్దామని కళ్యాణ్ రామ్ చేసిన నా నువ్వే జూన్ 14న వస్తే రెండు రోజులకే మాయం. జులై 5న వచ్చిన గోపీచంద్ పంతం నెగ్గలేదు. జులై 12న మెగా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని విజేతగా పరిచయం చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఇక దిల్ రాజు బొమ్మరిల్లు రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్న నితిన్ శ్రీనివాస కళ్యాణం ఆగస్ట్ 9న వస్తే దాని ఫలితం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గే కామెడీతో నాగశౌర్య ట్రై చేసిన @నర్తనశాల ఆగస్ట్ 30న విడుదలైతే వచ్చింది అని ప్రేక్షకులు గుర్తించే లోపే వెళ్లిపోయింది. ఇక సెప్టెంబర్ 13న పండగ సందర్భంగా వచ్చిన శైలజారెడ్డి అల్లుడు సవాళ్లకు ఎదురీదుతున్నాడు. లాభాల సంగతేమో కానీ జరిగిన బిజినెస్ కు తగ్గ మొత్తం వస్తే చాలంటున్నారు బయ్యర్లు. అదే రోజు వచ్చిన సమంతా యుటర్న్ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్లోగా నడుస్తోంది.

కానీ ఇంత యాంటీ సెంటిమెంట్ లో గెలిచిన సినిమా ఒకటుంది. అదే ఆరెక్స్ 100. జులై 12న విజేతతో పాటు విడుదలైన ఈ మూవీ అనూహ్యంగా అంచనాలకు మించి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎక్కువగా యూత్ కు పరిమితమైన ఆరెక్స్ 100 వాళ్ళ ద్వారానే బ్రహ్మాండమైన వసూళ్లు దక్కించుకుని ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. కానీ ఆ రోజు ఇదొక్క సినిమానే విడుదల కాలేదు కాబట్టి నెగటివ్ సెంటిమెంట్ కి విజేత బలైతే ఆరెక్స్ 100 సేఫ్ గా నిలిచింది. 

వీటిని గమనిస్తే ఏది కూడా అన్ని వర్గాలతో ఏకగ్రీవంగా చాలా బాగుంది సూపర్ హిట్ అనిపించుకున్నది లేదు. ఈ ఏడాది టాప్ హిట్స్ గా నిలిచిన వాటిలో మహానటి-గీత గోవిందంలు బుధవారం విడుదల కాగా రంగస్థలం-భరత్ అనే నేను-ఛలో-భాగమతి-గూఢచారి లాంటివన్నీ శుక్రవారం రిలీజైనవి. ఫ్రైడే హిట్లు ప్లాప్లు సహజంగా ఉంటాయి. అందులో ప్రత్యేకత ఏమి లేదు. వరుణ్ తేజ్ తొలిప్రేమ మాత్రమే ఈ ట్రెండ్ కి ఎదురీది శనివారం విడుదలై సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ 27 కూడా గురువారమే. ఆ రోజు నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్ తో పాటు మణిరత్నం కోలీవుడ్ స్టారర్ నవాబ్ కూడా విడుదలవుతుంది. మరి ఈ రెండు గురువారం చూపిస్తున్న నెగటివ్ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తాయి లేదో చూడాలి.