Begin typing your search above and press return to search.

సంక్రాంతికి మూడు డబ్బింగ్ సినిమాలట

By:  Tupaki Desk   |   19 Nov 2017 3:30 AM GMT
సంక్రాంతికి మూడు డబ్బింగ్ సినిమాలట
X
తమిళ డబ్బింగ్ సినిమాలు ఒకప్పుడు టాలీవుడ్ పై చాలా ప్రభావమే చూపించేవి. తెలుగు సినిమాల్ని కూడా తోసిరాజని భారీ వసూళ్లు రాబట్టేవి. కానీ గత కొన్నేళ్లలో నెమ్మదిగా అనువాదాల జోరు తగ్గిపోయింది. తెలుగులోనే కొత్త తరహా సినిమాల జోరు పెరగడం.. అదే సమయంలో తమిళ సినిమాల్లో కంటెంట్ తగ్గడంతో వాటికి అంతగా ఆదరణ కనిపించడం లేదు. ఐతే ఇప్పుడు మళ్లీ డబ్బింగ్ సినిమాలకు ఊపొచ్చింది. ఈ నెలలో రెండు వీకెండ్లలో తమిళ సినిమాల జోరే కనిపిస్తోంది. గత వారం వచ్చిన ‘అదిరింది’.. ‘డిటెక్టివ్’ మంచి ఆదరణ పొందగా.. ఈ వారం చాలా సినిమాలు రిలీజైనప్పటికీ అందులో తమిళం నుంచి వచ్చిన ‘గృహం’.. ‘ఖాకి’ సినిమాలకే ఆదరణ కనిపిస్తోంది.

ఈ పరిణామం తమిళ డబ్బింగ్ సినిమాల మార్కెట్‌ కు ఊపు తెస్తోంది. సంక్రాంతికి తమిళంలో రిలీజయ్యే భారీ సినిమాల్ని తెలుగులోనూ ఒకే సమయానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘అజ్నాతవాసి’.. బాలకృష్ణ ‘జై సింహా’.. రవితేజ ‘టచ్ చేసి చూడు’ లాంటి భారీ సినిమాలు తెలుగులో సంక్రాంతి రేసులో ఉన్నప్పటికీ.. మూడు డబ్బింగ్ సినిమాల్ని సంక్రాంతికే తెలుగులో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్య మూవీ ‘తానా సేంద్ర కూట్టం’ తెలుగు వెర్షన్‌ తో పాటుగా విశాల్ అభిమన్యుడు’.. విక్రమ్ ‘స్కెచ్’ సినిమాల్ని కూడా తెలుగులో ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ మధ్య తెలుగులోకి వచ్చే తమిళ అనువాదాలకు సెన్సార్ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో డిసెంబర్లోనే సెన్సార్ కూడా చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ మన సినిమాలకే థియేటర్లు కష్టమయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలకు స్క్రీన్లు ఎక్కడ దొరుకుతాయో చూడాలి.