Begin typing your search above and press return to search.

మహేష్ వచ్చే లోపే దంచుకోవాలి.

By:  Tupaki Desk   |   23 Sep 2017 1:30 PM GMT
మహేష్ వచ్చే లోపే దంచుకోవాలి.
X
తెలుగు రాష్ట్రాల సంగతేమో కానీ.. అమెరికాలో మాత్రం ‘జై లవకుశ’ లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం రెండో రోజే అక్కడ మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తొలి రోజే 8 లక్షల డాలర్లు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు షోలన్నీ పూర్తి కాకముందే మిలియన్ మార్కును దాటేసింది. మామూలుగా అమెరికాలో కొత్త సినిమాలకు శనివారం అత్యధిక వసూళ్లుంటాయి. కాబట్టి మూడో రోజు ఈ చిత్రం కనీసం 3 లక్షల డాలర్లు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం కూడా జోరు చూపిస్తే ఈజీగా 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేయొచ్చు. ఐతే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును అందుకుంటుందా లేదా అన్నది సోమ.. మంగళవారాల వసూళ్లను బట్టి ఆధారపడి ఉంటుంది.

ఐతే ‘జై లవకుశ’ మాస్ సినిమా కావడం.. టాక్ మరీ గొప్పగా ఏమీ లేకపోవడం వల్ల లాంగ్ రన్ ఉంటుందా అన్నది సందేహమే. పైగా బుధవారం మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ వచ్చేస్తోంది. మామూలుగానే అమెరికాలో మహేష్‌ కు ఫాలోయింగ్ ఎక్కువ. పైగా మురుగదాస్ దర్శకత్వంలో నటించడంతో ‘స్పైడర్’పై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఈ చిత్రం బుధవారం రిలీజవుతుండగా.. మంగళవారమే ప్రిమియర్ల హడావుడి మొదలవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ జోరుకు ఆ రోజే తెరపడొచ్చు. ‘స్పైడర్’కు ఎదురు నిలిచి.. వీక్ డేస్‌ లోనూ ‘జై లవకుశ’ నిలకడగా వసూళ్లు సాధించడం కష్టమే. పైగా శుక్రవారానికి ‘మహానుభావుడు’ కూడా రెడీ అవుతోంది. కాబట్టి ‘జై లవకుశ’ ఏం సాధించినా ఈ మూణ్నాలుగు రోజుల్లోనే సాధించాలి. మరి మంగళవారం లోపు ఈ చిత్రం ఎంత వసూలు చేసి.. బయ్యర్ కు ఏ మేరకు లాభాలందిస్తుందో చూడాలి.