Begin typing your search above and press return to search.

ఈ వారం పైచేయి ఎవరిదో

By:  Tupaki Desk   |   10 July 2018 6:29 AM GMT
ఈ వారం పైచేయి ఎవరిదో
X
గత శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫైట్ అనుకున్న రేంజ్ లో సాగకపోవడంతో సినిమా ప్రేమికులు నిరాశలో ఉన్నారు. ఆ మాటకొస్తే మహానటి తర్వాత యునానిమస్ గా హిట్ అనిపించుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. అన్ని అంతంతమాత్రంగానే ఆడాయి. ఇక ఇప్పుడు రానున్న గురు శుక్రవారాల్లో మూడు సినిమాలు రానుండటం ఆసక్తిని రేపుతోంది. ఫస్ట్ ప్లేస్ అనలేం కానీ మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమవుతున్న మూవీ కాబట్టి విజేత మీద ఫాన్స్ పరంగా సాఫ్ట్ కార్నర్ ఉన్న మాట వాస్తవం. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని హీరోగా లాంచ్ చేస్తూ సాయి కొర్రపాటి నిర్మించిన విజేత 12న రానుంది. టైటిల్ కూడా 84లో వచ్చిన చిరంజీవి ఆల్ టైం ఫ్యామిలి హిట్ మూవీది పెట్టడంతో సెంటిమెంట్ పరంగా కూడా అభిమానులు కనెక్ట్ అవుతున్నారు. ట్రైలర్ మరీ కొత్తగా అనిపించకపోయినా ఎమోషన్స్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ ని దర్శకుడు రాకేష్ శశి బాగా డీల్ చేసుంటాడన్న ఇంప్రెషన్ కలగడంతో పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇది నిలబడిపోతుంది.

ఇక అదే రోజు వస్తున్న మరో స్ట్రెయిట్ చిత్రం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన అరెక్స్ 100. వింటేజ్ బైక్ గా యూత్ మనసులో మిగిలిపోయి ఇప్పుడు వాడుకలో లేని మోడల్ ని పేరుగా పెట్టుకుని టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా ప్రమోషన్ టార్గెట్ చేసిన యూత్ కి బాగా రీచ్ అయిపోయింది. దానికి తోడు విడుదల చేసిన రెండు ట్రైలర్స్ లోనూ లవ్ రొమాన్స్ తో పాటు కావాల్సినంత యాక్షన్ మసాలా ఉందనేలా చూపడంతో ఓపెనింగ్స్ మీద ఆశలు పెట్టుకుంది యూనిట్. హీరో కార్తీక్ గుమ్మకొండ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో సహా అందరు కొత్తవారే కావడంతో మొదటిరోజే సినిమా చూస్తారా అనేది కొంత అనుమానమే. టాక్ బాగా వస్తే కనక పండగే.

ఇక మరుసటి వస్తున్న డబ్బింగ్ మూవీ చినబాబుపై భారీ కాదు కానీ ఓ మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి. పల్లెటూరి నేపధ్యంలో ఊర తమిళ బ్యాక్ డ్రాప్ తీసిన ఈ మూవీ మనవాళ్లకు ఎంత వరకు నచ్చుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఎమోషన్స్ ని బేస్ చేసుకుని తీసిందే. మొత్తం మూడు సినిమాలు ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేనివి కావడం విశేషం. మరి సమానమైన పోటీలా అనిపిస్తున్న ఈ ట్రయాంగిల్ వార్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే శుక్రవారం దాకా ఆగాలి.