టాప్ స్టోరి: చుక్కల్లో చక్కనమ్మలు

Thu Mar 14 2019 11:06:36 GMT+0530 (IST)

దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవడం మన భామలు ఉపయోగించే టెక్నిక్. లాజిక్ తో కొట్టేస్తారు. డిమాండ్ ఉన్నప్పుడే దండుకోవాలి! ఒకసారి నేము.. ఫేమ్ రివర్సయితే అటుపై సంపాదించుకోవడానికి కుదరదు. ఎవరూ పట్టించుకునే సన్నివేశమే ఉండదు. అందుకే నాలుగైదు సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్నప్పుడే చకచకా సంపాదించేసుకోవాలి. అందుకు తగ్గ ప్రణాళికలతో దూసుకుపోవాలి. ఈ విషయంలో ఇప్పుడున్న అగ్ర కథానాయికలతో పాటు నవతరం నాయికలు అంతే తెలివిగా వ్యవహరిస్తున్నారు.బాహుబలి తర్వాత మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు ఆశించినన్ని అవకాశాలు రాలేదు. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన నటించిన `ఎఫ్ 2` బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తమన్నా అందచందాలకు నటనకు జనం ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా మిల్కీకి హైప్ వచ్చింది. కొంతకాలంగా పరాజయాల బాటలో ఉన్న మిల్కీ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి`లోనూ ఆఫర్ వచ్చింది. ఇదే స్పీడ్ లో వరుసగా సినిమాలకు సంతకాలు చేసి నటించేస్తోంది. పనిలో పనిగా వాణిజ్య ప్రకటనల్ని ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా గోపిచంద్ - తిరు - 14 రీల్స్ సినిమాకి మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి కోటిన్నర డిమాండ్ చేసిందట ఈ అమ్మడు. మామూలుగా అయితే అంత సీనేం ఉండదు. కానీ ఎఫ్ 2 సక్సెస్ తర్వాత నిర్మాతలు ఆలోచించుకోవాల్సిన సన్నివేశం తలెత్తింది. దీంతో మిల్కీ డిమాండ్ చేసినంతా ఇచ్చేందుకు ఓకే చేప్పారట. ప్రస్తుతం వరుస సినిమాలతో మిల్కీ బిజీ బిజీగా ఉండడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బాహుబలి దేవసేన అనుష్కను మించిన జోరు తమన్నా చూపిస్తోంది ఇప్పుడు.

నవతరం కథానాయిక కీర్తి సురేష్ `మహానటి` తర్వాత ఆచి తూచి అడుగులేస్తోంది. వరుసగా తమిళ డబ్బింగులు రిలీజైనా వాటిలో ఏవీ సరైన హిట్ కొట్టలేదు. అయినా మహానటి హ్యాంగోవర్ ఇంకా కీర్తికి క్రేజీ ఆఫర్లను తెస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈ అమ్మడు ఏవి పడితే అవి అంగీకరించకుండా బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ భారీ ఆఫర్ కి సంతకం చేసింది. మరోవైపు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ఆఫర్ కోసం కీర్తి వేచి చూస్తోందన్న ప్రచారం ఉంది. ఇక బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన నటించే చిత్రానికి 4 కోట్లు డిమాండ్ చేసిందట. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుకని నిర్మాతలు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇది ఓ లెజెండరీ ఫుట్ బాల్ ఆటగాడి జీవితకథతో తెరకెక్కుతున్న బయోపిక్ అని తెలుస్తోంది. కాస్త ఆలస్యం అయినా కానీ కీర్తి ప్లానింగ్ బావుందే అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత ఒక్కో సినిమాకి కోటిన్నర నుంచి 2కోట్లు డిమాండ్ చేస్తున్నారని అక్కినేని కాంపౌండ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాణిజ్య ప్రకటనలకు కోట్లలో ఒప్పందాలు చేసుకోవడంపై ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇతర భామలు స్పీడ్ మీద ఉన్న వాళ్లు కోట్లలో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు కుదర్చుకుంటూ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.