Begin typing your search above and press return to search.

సుక్కుతో ‘జగడం’ గురించి దిల్ రాజు..

By:  Tupaki Desk   |   22 Jun 2017 10:18 AM GMT
సుక్కుతో ‘జగడం’ గురించి దిల్ రాజు..
X
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ను దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత దిల్ రాజు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’ ఎంత పెద్ద హిట్టో.. సుక్కుకు దర్శకుడిగా అది ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి రోజుల్లో ‘ఆర్య’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా నిర్మించడానికి దిల్ రాజు ముందుకు రావడం విశేషమే. ఐతే ‘ఆర్య’తో అంతగా మెప్పించిన సుక్కు.. ఆ తర్వాత ‘జగడం’తో నిరాశ పరిచాడు. నిజానికి ఈ సినిమాను దిల్ రాజే నిర్మించాల్సిందట. అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారట. ఐతే ఈ సినిమా స్క్రిప్టు విన్నాక తాను కంగారు పడ్డట్లు దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. స్క్రిప్టు మార్చాలని రాజు కోరినా సుక్కు వినలేదట. చివరికి ఆ సినిమా తన చేతి నుంచి వెళ్లిపోయిందని రాజు తెలిపాడు.

తాను కథల విషయంలో చాలా పట్టుదలగా ఉంటానని.. కోట్లు పెట్టి తీసే సినిమా కాబట్టి అస్సలు రాజీ పడనని.. ఏదైనా తేడాగా అనిపిస్తే కచ్చితంగా చెప్పేస్తానని.. సుకుమార్ ‘జగడం’ స్క్రిప్టు వినిపించినపుడు తనకు ఒక రకమైన భయం కలిగిందని రాజు తెలిపాడు. ఇది వర్కవుట్ కాదేమో అని తాను అనుకున్నానని.. తర్వాత అల్లు అర్జున్ అభిప్రాయం తెలుసుకుందామని అతడికి కథ వినిపించగా.. అతనూ తన అభిప్రాయంతో ఏకీభవించాడని రాజు వెల్లడించాడు. ఐతే సుకుమార్ ఏదైనా అనుకుంటే దానికే ఫిక్స్ అయిపోతాడని.. దాన్నుంచి బయటికి రాడని.. ‘జగడం’ విషయంలోనూ అతను రాజీ పడలేదని తెలిపాడు. తాను ఒప్పుకోకుంటే వేరే నిర్మాతను చూసుకుంటానని చెప్పిన సుకుమార్.. అన్నట్లే రాత్రికి రాత్రే వేరే నిర్మాతను ఒప్పించి రామ్ హీరోగా ఈ సినిమా మొదలుపెట్టాడని రాజు తెలిపాడు. ఐతే సుక్కుతో ఉన్న రిలేషన్ దృష్ట్యా తాను.. అల్లు అర్జున్ ‘జగడం’ ఓపెనింగ్ కు హాజరయ్యామని.. ఐతే ‘జగడం’ సినిమా ఫలితం ఏమైందో తెలిసిందే అని రాజు అన్నాడు. ఐతే సుకుమార్ టెర్రిఫిక్ రైటర్ అని.. కాబట్టే తొలి ప్రయత్నంలోనే ‘ఆర్య’ లాంటి డిఫరెంట్ మూవీ చేశాడని రాజు తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/