Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చచ్చి బతికిన రోజది

By:  Tupaki Desk   |   3 Aug 2015 1:31 PM GMT
మెగాస్టార్ చచ్చి బతికిన రోజది
X
మెగాస్టార్ అనగానే మనకు చిరంజీవే గుర్తుకొస్తాడు. కానీ ఇక్కడ మాట్లాడుతోంది టాలీవుడ్ మెగాస్టార్ గురించి కాదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి. భారతీయ సినిమాకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన ప్రొఫైల్ అమితాబ్ బచ్చన్ ది. నీ వాయిస్ పనికి రాదు, హీరోగా నిన్నెవరు చూస్తారు అన్న వాళ్లతోనే నీకు తిరుగులేదని అనిపించుకున్న ఘనుడు అమితాబ్. హీరోగా తిరుగులేని స్థాయికి చేరుకుని.. మళ్లీ జీరోగా మారి.. ఆపై ఎంతో దృఢ సంకల్పంతో అత్యున్నత స్థితికి చేరుకున్న గొప్ప వ్యక్తి అమితాబ్. తెరమీదే కాదు, నిజ జీవితంలోనూ ఆయన హీరో. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం. ఎన్నో మలుపులు తిరిగిన అమితాబ్ జీవితంలో ఆగస్టు 2 అనేది ప్రత్యేకమైన రోజు.

1982లో కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయనకు పెద్ద ప్రమాదం జరిగింది. ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా అమితాబ్ ఓ టేబుల్ మీదికి దూకారు. ఆ సమయంలో ఓ కొయ్య ఆయన కడుపులోకి గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న అమితాబ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపారు అమితాబ్. ఆగస్టు 2న పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరారు. నాటి అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘33 ఏళ్ల కిందట ఇదే రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరాను. అప్పుడు తొలిసారి మా నాన్న కళ్లలో నీళ్లు చూశాను. అది నిజంగా నాకు పునర్జన్మ. అభిమానుల ఆశీర్వచనాలు, వారి పూజా ఫలం వల్లే మళ్లీ ఆరోగ్యంగా తిరిగొచ్చా. వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు అమితాబ్.