పైరసీ పని పట్టి విశాల్ హీరో అయిపోయాడు

Wed Sep 13 2017 12:17:41 GMT+0530 (IST)

తమిళనాట పైరసీ భూతం ఎంత తీవ్ర స్థాయిలో విస్తరించిందో అందరికీ తెలిసిందే. ఒక కొత్త సినిమా రిలీజైన రోజు రాత్రికే కొన్ని వెబ్ సైట్లలో ప్రత్యక్షమైపోతూ ఉంటుంది. ఫలానా సమయానికి ఈ సినిమాను అప్ లోడ్ చేస్తామని ఏ బెదురు లేకుండా వెబ్ సైట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్స్ ఇచ్చి మరీ పైరసీ ప్రింట్లను వెబ్ సైట్లలో పెడతాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఐతే రోజు రోజుకూ పైరసీ వెబ్ సైట్లు రెచ్చిపోతున్నా కోలీవుడ్ పెద్దలు ఏమీ చేసింది లేదు. ఐతే హీరోగా ఉన్నప్పట్నుంచి పైరసీ మీద పోరాడుతున్న విశాల్.. కొన్ని నెలల కిందట తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడయ్యాక పైరసీ సైట్ల పని పడతానంటూ హెచ్చరిక జారీ చేశాడు.ఐతే కేవలం మాటలకు పరిమితం కాకుండా పైరసీపై పోరాటానికి ఒక టీం ఏర్పాటు చేసి గత ఆరు నెలలుగా  ఆ పని మీదే దృష్టి పెట్టాడట విశాల్. ఇప్పుడు వీళ్ల ప్రయత్నానికి ఫలితం వచ్చింది. తమిళ్ గన్ అనే పేరుమోసిన పైరసీ వెబ్ సైట్ అడ్మిన్ ను విశాల్ టీం వల వేసి పట్టుకుంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పాటుగా ‘తమిళ్ రాకర్స్’.. ‘తమిళ్ యోగి’.. ‘తిరుట్టు వీసీడీ’ లాంటి కొన్ని పేరున్న పైరసీ వెబ్ సైట్లపై విశాల్ టీం దృష్టిపెట్టిందట. వాళ్లను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పాడు విశాల్. తాము ఎలా ఈ వెబ్ సైట్ అడ్మిన్ ను పట్టుకున్నది వివరిస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు విశాల్. మొత్తానికి ఇంతకుముందున్న నిర్మాతల మండలి కార్యవర్గం మీటింగులు పెట్టి భజ్జీలు తినడం తప్పితే.. చేసిందేమీ లేదంటూ అప్పట్లో విశాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దాని తర్వాత అతను నిర్మాతల మండలితో పోరాటం మొదలుపెట్టాడు. వాళ్లపై ఎన్నికల్లో విజయం సాధించాడు. ఇప్పుడు తాను చేతల మనిషని రుజువు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.