కూలీ నెంబర్ వన్ రీమేక్ కన్ఫ్యూజన్

Tue Mar 12 2019 20:00:01 GMT+0530 (IST)

నిన్న ఓ మీడియా సైట్ లో వెంకటేష్ కూలి నెంబర్ వన్ రీమేక్ ని హిందీలో వరుణ్ ధావన్ రీమేక్ చేయబోతున్నాడన్న వార్త చూసి వెంకీ ఫాన్స్ కొంత షాక్ అయ్యారు. అప్పుడెప్పుడో 1991లో వచ్చిన తెలుగు సినిమాని బాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళి తీయడం ఏమిటా అనే సందేహం సహజంగానే వచ్చింది. పైగా కూలీ నెంబర్ వన్ కమర్షియల్ గా పాస్ అయ్యింది కానీ మరీ గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ అయితే కాదు. ఆమాటకొస్తే బొబ్బిలి రాజా మేనియాలో ఉన్న అభిమానులకు ఇది అంతగా నచ్చలేదు కూడా.అందుకే దీని రీమేక్ అనగానే సవాలక్ష అనుమానాలు. కానీ అసలు విషయం వేరుగా ఉంది. వరుణ్ ధావన్ నిజంగానే కూలీ నెంబర్ వన్ రీమేక్ చేస్తున్నాడు. అయితే అది వెంకటేష్ ది కాదు. 1995లో హిందీలో వచ్చిన గోవిందాది. రెండు కథల్లో హీరో పాత్ర వృత్తి తప్ప ఇంకెక్కడా వీసమెత్తు పోలిక ఉండదు. ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. ఇప్పుడు వరుణ్ ధావన్ చేయబోయేది గోవిందా చేసిన కూలీ నెంబర్ వన్. కరిష్మా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్.

వరుణ్ దీనికి ఓకే చెప్పడానికి ప్రధాన కారణం గోవిందా సినిమాకు దర్శకత్వం వహించింది నాన్న డేవిడ్ ధావనే. ఆయన దర్శకత్వంలోనే స్వల్ప మార్పులతో దీన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలో ఈ తండ్రి కొడుకుల కాంబోలో జుడ్వా 2 మంచి హిట్ గా నిలిచింది. అదే తరహాలో కూలీ నెంబర్ వన్ ని ప్లాన్ చేయబోతున్నారు. సో వెంకటేష్ కూలి నెంబర్ వన్ రీమేక్ గురించి క్లారిటీ వచ్చినట్టేగా.  ఫాన్స్ ఇక రిలాక్స్ అవ్వొచ్చు