Begin typing your search above and press return to search.

ఈ స్కూలు పిల్లోడు 40 కోట్ల క్ల‌బ్ హీరో

By:  Tupaki Desk   |   16 Sep 2019 10:12 AM GMT
ఈ స్కూలు పిల్లోడు 40 కోట్ల క్ల‌బ్ హీరో
X
ప‌రిమిత బ‌డ్జెట్ తో వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన `సైరాఠ్` గురించి చాలా కాలం పాటు ముచ్చ‌టించుకున్నారు. ఆ సినిమా కేవ‌లం 2కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కి 100 కోట్లు వ‌సూలు చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. అంత‌గా ముక్కు ముఖం తెలియ‌ని న‌టీన‌టుల‌తో తీసి అంత హిట్టు కొట్టేయ‌డ‌మేంటో అంటూ కేస్ స్ట‌డీ చేశారు మ‌న తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అంత పెద్ద రేంజు కాదు కానీ.. ఇటీవ‌లే మ‌ల‌యాళంలో వ‌చ్చిన `తన్నీర్ మాథన్ దినంగల్` అనే చిత్రం కేవ‌లం 2 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కి సుమారు 40 కోట్లు వసూలు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ నిర్మాతలను ఊరిస్తున్న సినిమా ఇది.

2019 జూలైలో ఈ సినిమా రిలీజైంది. కేవ‌లం కేర‌ళ బాక్సాఫీస్ నుంచి దాదాపు 18కోట్లు వ‌సూలు చేయ‌గా.. వ‌ర‌ల్డ్ వైడ్ 35 రోజుల్లో 35 కోట్ల మేర వ‌సూళ్లు సాధించింది. ఆ త‌ర్వాత కూడా చాలాచోట్ల సినిమా బాగా ఆడింద‌ట‌. ఇత‌ర‌త్రా అన్నీ క‌లుపుకుని 40 కోట్ల మేర ఫుల్ ర‌న్ వ‌సూళ్లు చేసింద‌ని విశ్లేషిస్తున్నారు.

`తన్నీర్ మాథన్ దినంగల్` చిత్రానికి గిరీష్ ఎ. డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వినీత్ శ్రీనివాసన్- మాథ్యూ థామస్- అనాశ్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది ఓ క్యూట్ స్కూల్ కిడ్స్ ల‌వ్ స్టోరి. అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన హావ‌భావాలు టీజ‌ర్- ట్రైల‌ర్- పోస్ట‌ర్ల‌లో ఆక‌ట్టుకుంటున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రీమేక్ లు .. ప్రీమేక్ ల‌పై ఆస‌క్తి చూపిస్తున్న మ‌న నిర్మాత‌లు త‌క్కువ ధ‌ర‌కు హ‌క్కులు కొనే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ట‌. అయితే ఇందులో మ‌ల‌యాళ వాసన‌ల్ని మార్చి తెలుగైజ్ చేస్తే ఇంకాస్త రిచ్ లుక్ వ‌స్తుందేమో!